Virat Kohli-Gautam Gambhir : టీమిండియాలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ కు ప్రత్యేకమైన పేజీలు ఉంటాయి. ఇద్దరు ఆవేశాన్ని ప్రదర్శించే ఆటగాళ్ళే. భారత జట్టుకు అద్భుతమైన విజయాలను అందించిన ప్లేయర్లే. ముందుగా చెప్పుకున్నట్టు వీరిలో ఆవేశం చాలా ఎక్కువ.. ముక్కుసూటి తనం కూడా చాలా ఎక్కువ.. అందువల్లే దేన్ని కూడా ఆపుకోలేరు. ఆనందం లభించినా.. జట్టు ఓటమి అంచులో నిలిచినా తట్టుకోలేరు. వెంటనే తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. అయితే వీరిద్దరూ పుష్కర కాలం క్రితం గొడవపడ్డారు. పరస్పరం విమర్శించుకున్నారు. ఆ తర్వాత ఇది ఐపీఎల్ క్రికెట్లోనూ సాగింది. దీంతో వారిద్దరూ ఉప్పు నిప్పులాగా ఉన్నారు. కొన్ని సంవత్సరాల వరకు వారు మాట్లాడుకోలేదు. పైగా ఐపీఎల్లో తారసపడినప్పుడు నేరుగానే తమ అగ్రహాన్ని వ్యక్తం చేసుకున్నారు. వీరిద్దరిని కలపడానికి చాలామంది ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పైగా విలేకరుల సమావేశంలో ఒకరినొకరు అంతర్గతంగా విమర్శించుకోవడం అప్పట్లో చర్చకు దారి తీసింది. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు కావడంతో ఎవరూ వెనక్కి తగ్గలేదు.. తగ్గే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. అయితే ఇటీవల ఐపీఎల్లో వీరిద్దరూ కలిసిపోయారు. సరదాగా సంభాషించుకున్నారు. ఒకరి భుజాల మీద మరొకరు చేతులు వేసుకొని కబుర్లు చెప్పుకున్నారు. దీంతో వారిద్దరూ తమ వైరానికి చెక్ పెట్టారని.. సుహృద్భావ వాతావరణానికి శ్రీకారం చుట్టారని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
హత్తుకుని అభినందించాడు
పెర్త్ టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా పై విజయం సాధించింది. న్యూజిలాండ్ పై మూడు టెస్టులు ఓడిపోయి… స్వదేశంలో పరువు తీసుకున్న టీమిండియా బలమైన ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయాన్ని సాధించింది. టీమిండియా సాధించిన ఈ విజయంలో విరాట్ కోహ్లీ తన వంతు పాత్ర పోషించాడు. చాలా రోజుల తర్వాత సెంచరీ చేసి టచ్ లోకి వచ్చాడు. దీంతో సెంచరీ చేసిన అనంతరం విరాట్ కోహ్లీని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభినందించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో అతడిని హత్తుకొని ప్రశంసల జల్లు కురిపించాడు. మొన్నటిదాకా వీరిద్దరూ ఉప్పుని నిప్పు లాగా ఉన్నారు. ఇప్పుడు కలిసి పోయారు. అంతేకాదు ప్రాణ స్నేహితులు లాగా మారిపోయారు. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీని గట్టిగా ఆలింగనం చేసుకున్న ఫోటో సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది. “ఒకరు ఉప్పెన.. ఇంకొకరు సముద్రం.. ఇప్పుడు కలిసిపోయారు.. ఇకపై ప్రత్యర్థి ఆటగాళ్లు సునామీలను చూస్తారు. టీమిండియా 295 పరుగులతో బలమైన ఆస్ట్రేలియాపై గెలవడం దానికి ఒక స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొంటూ” నెటిజెన్లు సామాజిక మాధ్యమాల వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.