Sunrisers Hyderabad 2025 : 2024 ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టు రన్నరప్ గా నిలిచింది. జట్టు ఫైనల్ పోటీలో కోల్ కతా చేతిలో ఓడిపోవడంతో కావ్య కన్నీరు పెట్టుకుంది. కావ్య అలా ఉండడాన్ని చూసి నెటిజన్లు బాధపడ్డారు. కన్నీటి పర్యంతమయ్యారు. గుండె ధైర్యాన్ని నింపుకో కావ్య అంటూ కామెంట్లు చేశారు. అయితే నాటి ఓటమి కావ్యలో కసిని పెంచినట్టుంది. జట్టును బలోపేతం చేసుకోవాలని ఆలోచనను రేకెత్తించినట్లు ఉంది. అందువల్లే ఈసారి రెట్టించిన ఉత్సాహంతో ఐపీఎల్ వేలంలో పాల్గొంది. అంతేకాదు తన జట్టుకు ఎవరైతే అవసరమో.. వారినే తీసుకుంది. అందువల్లే ఈసారి హైదరాబాద్ జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది. ఇటీవల రిటైన్ జాబితాలో నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, హెడ్, కమిన్స్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లను తీసుకున్న కావ్య.. వేలంలో మరింత ఉత్సాహంతో అడుగులు వేసింది. గట్టి ప్రణాళికతో బలమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
వారి వల్ల బలోపేతం
హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, కమిన్స్ వంటి ఆటగాళ్లను అంటిపెట్టుకున్న కావ్య.. వేలంలో ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్, కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, రాహుల్ చాహర్, ఆడం జంపా తో హైదరాబాద్ జట్టు బలంగా కనిపిస్తోంది. పేస్, స్పిన్ బౌలర్ల కలయికతో దృఢంగా మారింది. ఇక బ్యాటర్లు కూడా అంతకుమించి అనే స్థాయిలో ఉండడంతో బ్యాటింగ్ బలం కూడా గతానికంటే పెరిగింది. అయితే హైదరాబాద్ జట్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎక్కువగా ఉండడం విశేషం. కమిన్స్, హెడ్, జంపా ప్రస్తుతం ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడుతున్నారు. వీరు ముగ్గురు గత ఏడాది వన్డే వరల్డ్ కప్ లో ఆడారు. ఆస్ట్రేలియా టీమ్ ఇండియా పై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఇక గత ఏడాది కమిన్స్ నేతృత్వంలో హైదరాబాద్ జట్టు ఐపిఎల్ ఫైనల్ వెళ్ళింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. తన నాయకత్వ పటిమతో హైదరాబాద్ జట్టును కమిన్స్ పటిష్టంగా నడిపించాడు. అందువల్లే అతనిపై కావ్య బలమైన నమ్మకం పెట్టుకుంది. ఇక హెడ్ కూడా వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇప్పుడు ఈశాన్ కిషన్ కూడా తోడు కావడంతో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం అయింది.
బౌలింగ్ కూడా
బౌలింగ్లో కమిన్స్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, ఆడం జంపా అద్భుతాలు చేయగలరు. వీరికి బలమైన ట్రాక్ రికార్డు ఉంది. అందువల్లే కావ్య వీరిపై భారీ అంచనాలు పెట్టుకుంది. వచ్చే సీజన్లో వీరంతా జట్టును ముందంజలో నడిపిస్తారని.. కచ్చితంగా ట్రోఫీ సాధించడంలో ఉపయోగపడతారని భావిస్తూ.. కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే గతంలో హైదరాబాద్ జట్టు ఎన్నడూ ఇంత బలంగా లేదని.. ఈసారి దృఢంగా కనిపిస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈసారి జట్టు కూర్పు విషయంలో కావ్య పకడ్బందీగా ఉన్నారని.. ఆమె ముందు చూపు ఫలిస్తుందని జోస్యం చెబుతున్నారు