Virat Kohli Vs Gambhir: ఐపీఎల్ లో సోమవారం వివాదాస్పదమైన ఘటన చోటుచేసుకుంది. ఈ సీజన్ లో సోమవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ, లక్నో జట్టు మెంటార్ గంభీర్ గొడవ పడడంతోపాటు పరస్పరం మాటల యుద్ధానికి దిగారు. ఈ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఈ విషయాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. వీరిద్దరిపై కొరడా ఝులిపించింది.
లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకనా స్టేడియంలో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నామమాత్రపు స్కోరు మాత్రమే సాధించింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పోయింది లక్నో జట్టు. 19.5 ఓవర్లలో 108 పరుగులకు ఆల్ అవుట్ అయింది. బెంగళూరు జట్టు ఇన్నింగ్స్ లో డూ ప్లెసిస్ ఒక్కడిదే టాప్ స్కోర్. 40 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ తో 44 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో మూడు ఫోర్లు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్లో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ 16 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ డబుల్ డిజిట్ కూడా అందుకోలేకపోవడంతో నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది బెంగళూరు జట్టు. అనంతరం బరిలోకి దిగిన లక్నో జట్టు స్వల్ప లక్ష్యాన్ని చేదించలేక చతికిల పడింది. 108 పరుగులకే కుప్ప కూలింది. కృష్ణప్ప గౌతమ్ 23 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైన బెంగుళూరు జట్టు బౌలింగ్ లో మాత్రం విజృంభించింది. మ్యాచ్ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లను పడగొట్టింది. ఒక దశలో లక్నో జట్టు కనీసం వంద పరుగులు కూడా చేయలేదనిపించేలా సాగింది బెంగళూరు బౌలింగ్. మహిపాల్ లోమ్రార్ మినహా మిగిలిన బౌలర్లు అందరూ వికెట్లు పడగొట్టారు.
వాదులాడుకున్న గౌతమ్ గంభీర్ – విరాట్ కోహ్లీ..
మ్యాచ్ ముగిసిన తర్వాత అసలు సిసలైన కథ మొదలైంది. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ వాదులాటకు దిగారు. గతంలో బెంగుళూరు జట్టుపై గెలిచిన తర్వాత గంభీర్ వ్యవహరించిన తీరుకు ప్రతిగా తాజాగా విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. దీనిపై మ్యాచ్ అనంతరం ఒక చోటకు చేరిన ఇరుజట్లు ప్లేయర్లు దీనికి సంబంధించిన డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్ – విరాట్ కోహ్లీ వాదులాడుకున్నారు. పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. దాదాపుగా ఇద్దరు ఒకరినొకరు తోసుకునేంత వరకు వెళ్లారు. సహచరులు అప్రమత్తమై ఇరువురిని విడగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. మ్యాచ్ ముగిసిన అనంతరం లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్ నేరుగా విరాట్ కోహ్లీ వద్దకు వచ్చి.. ఏదో చెప్పడంతో ఈ గొడవ ఆరంభమైంది. దీనికి విరాట్ కోహ్లీ కూడా అంతే ఘాటుగా రిప్లై ఇవ్వడంతో గంభీర్ జోక్యం చేసుకున్నాడు. కోహ్లీ – గంభీర్ అతి సమీపానికి వచ్చి గొడవపడ్డారు. కోహ్లీ ఆ సమయంలో గంభీర్ భుజంపై చేయి వేయడం కనిపించింది. గొడవ తీవ్రం కావడంతో కేఎల్ రాహుల్, ఇతర ప్లేయర్లు వారిద్దరిని దూరంగా తీసుకువెళ్లారు. అయినా వారిని విడిపించుకుని మళ్ళీ ఎదురెదురుగా రావడం స్టేడియంలో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తీవ్రంగా స్పందించిన బీసీసీఐ..
మ్యాచ్ అనంతరం లక్నో జట్టు మెంటార్ గంభీర్, బెంగళూరు జట్టు ప్లేయర్ విరాట్ కోహ్లీ మధ్య జరిగిన గొడవను బీసీసీఐ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినట్లు వెల్లడించింది. బిసిసిఐ ఇద్దరిపైనా కొరడా ఝులిపించింది. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ కు చెల్లించాల్సిన మ్యాచ్ ఫీజులో ఏకంగా 100% కోత పెట్టింది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన కారణంగా నిబంధనలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ గొడవపై సమగ్రమైన నివేదిక అందించాలని రెండు జట్ల ప్రాంచైజీలను ఆదేశించింది. తాజా గొడవ వ్యవహారం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి గొడవకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి.