IPL 2025: క్రికెట్ లీగ్ లో అత్యంత రిచెస్ట్ టోర్నీగా ఐపీఎల్ కు పేరుంది. 2008లో ప్రారంభమైన ఈ టోర్నీ విజయవంతంగా కొనసాగుతోంది. ఏటికేడు ప్రేక్షకుల ఆదరణ పెంచుకుంటూ దూసుకుపోతోంది. అంతటి కోవిడ్ సమయంలోనూ ఐపీఎల్ నిర్వహించారంటే దానికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. 2019లో మనదేశంలో ఎన్నికలు జరిగినప్పుడు.. దక్షిణాఫ్రికాలో టోర్నీ నిర్వహించారు. ఇది ప్రేక్షకుల ఆదరణ పొందుతుందా అని ఐపిఎల్ ప్రారంభంలో మాజీ క్రీడాకారులు సందేహం వ్యక్తం చేశారు. కానీ వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రేక్షకులు ఐపీఎల్ కు బ్రహ్మరథం పట్టారు.. ఫలితంగా ఫిఫా ఫుట్ బాల్ కప్ ను కూడా మించిపోయి ఐపీఎల్ రిచెస్ట్ లీగ్ గా ఆవిర్భవించింది. ఫ్రాంచైజీ జట్లు, ఆటగాళ్లు ఇలా అందరిపై కనక వర్షం కురిపించే కామధేనువుగా మారింది. ఒక అంచనా ప్రకారం 2008 నుంచి 2024 ప్రకారం బిసిసిఐ ఐపీఎల్ ద్వారా వేలకోట్లను వెనకేసుకుందని, ఆవిర్భావం నుంచి 2008 వరకు బిసిసిఐ ఆర్జించిన డబ్బు కంటే అది ఎక్కువని తెలుస్తోంది. అందువల్లే ప్రపంచ క్రికెట్ ను బీసీసీఐ శాసిస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.
2008 నుంచి 2024 వరకు విజయవంతంగా ఐపీఎల్ సీజన్లు నిర్వహించిన బీసీసీఐ… తదుపరి సీజన్ కోసం రెడీ అవుతోంది. 2025 లో జరిగే ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. కొన్ని ఫ్రాంచైజీలు తమ బౌలర్లకు ఇతర ప్రాంతాలలో శిక్షణ ఇస్తున్నాయి. కొత్త కోచ్ లను నియమించుకుంటున్నాయి. ఐపీఎల్ కప్ గెలిస్తే విలువ అమాంతం పెరుగుతుంది, వచ్చే ప్రైజ్ మనీ కూడా భారీగా ఉంటుంది కాబట్టి అన్ని ఫ్రాంచైజీలు 2025 సీజన్ కప్ గెలిచేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. అంతేకాదు 2025 సీజన్ కు సంబంధించి త్వరలో వేలం జరగనుంది. అయితే ఈ వేళలో ఈసారి బీసీసీఐ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫ్రాంచైజీలు ఒత్తిడి తేవడంతోనే బీసీసీఐ తలవంచినట్టు ప్రచారం జరుగుతోంది.
ఆ వెసలు బాటు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్(వారి వద్దే ఉంచుకోవడం లేదా ఇతర జట్ల నుంచి కొనుగోలు చేయడం) చేసుకునేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.. ఇందులో నలుగురు స్వదేశీ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉంటారని తెలుస్తోంది. వాస్తవానికి గతంలో బీసీసీఐ ఫ్రాంచైజీలకు ఈ స్థాయిలో ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు.. అయితే కొన్ని జట్లు బీసీసీఐ మీద ఒత్తిడి తీసుకురావడంతో ఈ నిర్ణయానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. ఈనెల 31న బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో అన్ని ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటున్నాయి.. బీసీసీఐ రిటైన్ నిబంధనను 8 మంది ఆటగాళ్లకు మార్చాలని ఫ్రాంచైజీ జట్లు కోరుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ జట్లు కోరినట్టుగా బీసీసీఐ ఆ నిర్ణయానికి గనుక ఒకే చెబితే.. ఐపీఎల్ లో పెద్ద మజా ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. “రిటైన్ నిబంధన గతంలో మాదిరిగానే ఉండాలి. అలా ఉంటేనే ఆటలో మజా ఉంటుంది. అలా కాకుండా ఫ్రాంచైజీ జట్టు చెప్పినట్టు బిసిసిఐ తల ఊపితే మెగా వేలంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం లభించదు. అలాంటప్పుడు ఆట అనేది ఆసక్తిని కలిగించదు. జట్ల మధ్య పోటీ తత్వం ఉంటేనే బాగుంటుంది. చూసే ప్రేక్షకులకు కూడా సరికొత్త అనుభూతి కలుగుతుందని” క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2024 ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల రిటైన్ నిబంధనను సడలించాలని కొన్ని జట్ల యాజమాన్యాలు బీసీసీఐ ని కోరాయి. అయితే ఆ సమయంలో ఆ యాజమాన్యాల విజ్ఞప్తిని బీసీసీఐ పెద్దలు తోసిపు చ్చారు. తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయిద్దామని పేర్కొన్నారు. వారికి మాట ఇచ్చినట్టుగానే 31 వ తేదీన జరిగే సమావేశంలో బీసీసీఐ పెద్దలు రిటైన్ నిబంధన పై చర్చ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.