Mohammed Shami : దేశవాళి క్రికెట్ టోర్నీలో అతడు బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. త్వరలో చండీగఢ్ జట్టుతో ఫ్రీ క్వార్టర్ ఫైనల్ ఆడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతడు ఆదివారం జాతీయ క్రికెట్ అకాడమీ లో చేరడం సంచలనాన్ని కలిగిస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అతడి సామర్థ్యంపై జాతీయ క్రీడ అకాడమీ వైద్య బృందం కొద్ది రోజుల్లో స్పష్టత ఇస్తుందని తెలుస్తోంది. జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి స్పష్టత రాగానే అతడు ఆస్ట్రేలియా వెళ్తాడని.. దీనికి సంబంధించి బిసిసిఐ వీసా కూడా సిద్ధం చేసిందని తెలుస్తోంది. అయితే అతడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడని సమాచారం. ఈ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా డిసెంబర్ 26 నుంచి తలపడతాయి. 30 తేదీ వరకు ఈ టెస్ట్ కొనసాగుతుంది. క్రికెట్ పరిభాషలో దీనిని బాక్సింగ్ డే టెస్ట్ అని పిలుస్తారు. ఇది మేల్ బోర్న్ వేదికగా జరుగుతుంది. జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా ఐదో టెస్ట్ జరుగుతుంది.
గాయం నుంచి కోలుకున్నట్టేనా..
గత ఏడాది జరిగినా వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ నేరుగా లండన్ వెళ్లిపోయాడు. అక్కడ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కొద్దిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఆ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీలో చేరాడు. ఆ సమయంలోనే అతడు ఐపీఎల్ లో ఆడతాడని ప్రచారం జరిగింది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించలేకపోవడంతో ఆ టోర్నికి దూరంగా ఉన్నాడు. అనంతరం t20 వరల్డ్ కప్ లో ఆడదాని వార్తలు ప్రసారమయ్యాయి. ఆ తర్వాత అవి కూడా పూర్తి నిరాధారమని తేలిపోయింది. అయితే ఇప్పుడు రంజీ ట్రోఫీలో అతడు ఆడుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగే మ్యాచ్లలో ఆడతాడని ప్రచారం జరుగుతోంది. అయితే నిన్నటి వరకు షమీకి దారులు మూసుకుపోయాయని.. అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యం సంపాదించుకోలేదని వార్తలు వినిపించాయి. సరిగా ఒకరోజు వ్యవధిలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షమీ పూర్తిస్థాయిలో సామర్థ్యం సాధించాడని.. అతడు ఆస్ట్రేలియాకు వెళ్లిపోవడమే తరువాయి అని తెలుస్తోంది. ఇక ఇటీవల బెంగాల్ జట్టు తరఫున రంజి క్రికెట్ ఆడుతున్న షమీ మధ్యప్రదేశ్ జట్టుపై ఐదు వికెట్లు పడగొట్టాడు. టి20 ఫార్మేట్ లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ జట్టు తరఫున అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బెంగాల్ జట్టు నాకౌట్ దశ దాకా వెళ్ళింది. ప్రీ క్వార్టర్స్ డిసెంబర్ 9న జరుగుతుంది. మ్యాచ్లో చండీగఢ్, బెంగాల్ జట్లు పోటీ పడతాయి. ఆ మ్యాచ్ పూర్తి అయిన తర్వాత షమీ సామర్థ్యాన్ని జాతీయ క్రికెట్ అకాడమీ వైద్యుల బృందం పరిశీలిస్తుంది. ఆ తర్వాత తుది నిర్ణయాన్ని వెల్లడిస్తుందని తెలుస్తోంది.