BCCI bias on Uppal Stadium: ఐపీఎల్ నిర్వహించే ప్రతి సీజన్లోనూ దక్షిణాదిలో మైదానాలు కిటకిలాడిపోతుంటాయి. మ్యాచ్ ఏదైనా సరే అభిమానులు భారీగా హాజరవుతుంటారు. క్రికెట్ మీద తమకున్న అభిమానాన్ని బయటపెట్టుకుంటారు. సోషల్ మీడియాలో వారు చేసే రచ్చ ఇంక మామూలుగా ఉండదు. వాస్తవానికి ఈ స్థాయి అభిమాన గణం ఉత్తర భారత దేశంలో అంతగా కనిపించదు. ఇదేదో రెండు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి రాస్తున్న కథనం కాదు. బిసిసిఐ పెద్దలు గీస్తున్న విభజన రేఖను దృష్టిలో పెట్టుకొని ఇలా బాధను వ్యక్తం చేయాల్సి వస్తోంది.
ఐపీఎల్ లో అన్ని జట్లు ఆడుతున్నాయి. దేశంలో కొన్ని ప్రాంతాల పేరుతో బిసిసిఐ జట్లను ఏర్పాటు చేసింది. ఈ జట్లు ఐపీఎల్లో అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన బిసిసిఐ.. ఒక ప్రాంతం మీద విపరీతమైన ప్రేమ కనబరుస్తోంది. మిగతా ప్రాంతాల మీద దారుణమైన నిర్లక్ష్యాన్ని చూపిస్తోంది. లీగ్ దశలో మ్యాచులు నిర్వహించి.. కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్ల విషయంలో మాత్రం బీసీసీఐ ఏకపక్ష విధానాన్ని కొనసాగిస్తుంది.
దక్షిణ భారత దేశంలో చెన్నై, కొచ్చి, విశాఖపట్నం, హైదరాబాదు లాంటి ప్రాంతాలలో విస్తారమైన క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. వీటిల్లో అద్భుతమైన సౌకర్యాలు కూడా ఉన్నాయి. అయితే వీటిని పక్కన పెట్టారు. క్వాలిఫైయర్ 1, క్వాలిఫైయర్ 2, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ లు ఉత్తర భారత దేశంలోని మైదానాలలో నిర్వహిస్తున్నారు. ఉత్తర భారత దేశంలో ఉన్న మైదానాలలో సౌకర్యాలు ఏమిటో.. దక్షిణ భారతంలో ఉన్న మైదానాలలో లేని సౌకర్యాలు ఏమిటో బీసీసీఐ పెద్దలు చెప్పాల్సి ఉంది. అసలు క్రికెట్ అంటేనే దక్షిణాది కదా. ఇక్కడ ప్రేక్షకులు ఏ స్థాయిలో క్రికెటర్లను.. క్రికెట్ ను ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విశాఖపట్నం వేదికగా మహిళల జట్టు ఆడుతున్న మ్యాచ్లను నిర్వహించినప్పుడు.. అభిమానులు భారీగా వచ్చారు. మహిళ క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. భారత మహిళా క్రికెటర్లు కూడా స్థానిక అభిమానుల ప్రేమ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయం బీసీసీఐ పెద్దలకు కనిపించకపోవడం విశేషం.
ఉప్పల్, కొచ్చి, చేపాక్, విశాఖపట్నం మైదానంలో లోకల్ ఫాన్స్ సపోర్టు విపరీతంగా ఉంటుంది. అటువంటిది ఇంత గొప్ప మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించకపోవడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బెంగళూరు మైదానంలో సాంకేతిక సమస్యలను సాకుగా చూపించిన బీసీసీఐ పెద్దలు.. కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచుల విషయంలో మాత్రం పక్కన పెట్టడం విశేషం. చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటికే అనేక రకాల సమస్యలను బీసీసీఐ పెద్దలు లేవనెత్తారు. వాటిని అక్కడి నిర్వాహకులు పరిష్కరించుకున్నారు. లీగ్ దశలో మ్యాచులను సమర్ధవంతంగా నిర్వహించారు. లీగ్ దశలో సక్రమంగా నిర్వహించినప్పుడు.. ప్లే ఆఫ్ విషయంలో అంతటి సమర్థత కరువైపోతుందా.. ఈ ప్రశ్నలకు బీసీసీఐ పెద్దలు సమాధానాలు చెప్పాల్సి ఉందని అభిమానులు అంటున్నారు.