https://oktelugu.com/

IND VS AUS Test Match : బంతి గింగిరాలు తిరగాలి.. కంగారుల పని పట్టాలి.. అప్పుడే బుమ్రా సేన కు పెర్త్ లో బలం దక్కేది..

ఇంకొన్ని గంటలు గడిస్తే చాలు.. ఆస్ట్రేలియా వేదికగా ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలవుతుంది. పెర్త్ వేదికగా భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాల నుంచి తొలి టెస్ట్ ఆరంభమవుతుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 21, 2024 / 02:38 PM IST

    IND VS AUS Test Match

    Follow us on

    IND VS AUS Test Match : రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలవల్ల గైర్హాజరు కావడంతో.. తొలి టెస్ట్ నాయకత్వ బాధ్యత బుమ్రా కు అప్పజెప్పింది టీమిండియా మేనేజ్మెంట్. దీంతో అతని సారథ్యంపై చర్చలు మొదలయ్యాయి. 2022లో బుమ్రా టీమిండియా కు నాయకత్వం వహించాడు. ఇంగ్లాండ్ జట్టుపై జరిగిన ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది.. ఇక ప్రస్తుతం పెర్త్ టెస్ట్ పై టీమ్ ఇండియా అభిమానులకు భారీ అంచనాలు లేవు. ఎందుకంటే స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను న్యూజిలాండ్ చేతిలో భారత్ కోల్పోయింది.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైట్ వాష్ కు గురైంది.. భారత జట్టుకు అత్యంత బలమైన బ్యాటింగ్ కొంతకాలంగా బలహీనంగా కనిపిస్తోంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సిరీస్లో అది ప్రధానంగా కనిపించింది. దీంతో బౌలర్ల పైనే అభిమానులకు కాస్త ఆశలు ఉన్నాయి.. అయితే పెర్త్ వేదికగా జరిగే టెస్టుల్లో బౌలర్లు సత్తా చాటాల్సి ఉంది. కంగారు బ్యాటర్లకు ముకుతాడు వేయాల్సి ఉంది. అప్పుడే ఈ సిరీస్ లో అభిమానులు ఆశించినట్టు భారత్ ముందడుగు వేయగలుగుతుంది.

    నాడు గెలిపించింది అతడే

    2018 -19 సీజన్లో విరాట్ ఆధ్వర్యంలో భారత్ జట్టు ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.. రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేసింది. ఈ రెండు సీజన్లలో భారత జట్టును గెలిపించింది బుమ్రా అనడంలో సందేహం లేదు.. తన అద్భుతమైన బంతులతో ఆస్ట్రేలియా బ్యాటర్లకు బుమ్రా చుక్కలు చూపించాడు. మైదానం కాస్త అనుకూలంగా ఉంటే చాలు అతడు ఆస్ట్రేలియా బౌలర్ల కంటే రెట్టించిన ఉత్సాహంతో రెచ్చిపోతాడు.. అందువల్లే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగే మైదానాలను పేస్ కు అనుకూలంగా ఆస్ట్రేలియా రూపొందించలేకపోతుందని కథనాలు వినిపిస్తున్నాయి.

    అరుదైన రికార్డు

    ఆస్ట్రేలియాతో బుమ్రా 7 మ్యాచ్ లు ఆడాడు.. 21.25 సగటుతో 34 వికెట్లు సొంతం చేసుకున్నాడు.. మెల్బోర్న్ వేదికగా 2018లో భారత్ ఆస్ట్రేలియా పై ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు. ఆరు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా కు పీడ కలను మిగిల్చాడు. ఇక మిగతా మ్యాచ్లలో అతడు అదరగొట్టాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్ లో గొప్పగా వికెట్లను సాధించలేకపోయినప్పటికీ.. ఆస్ట్రేలియా ఆటగాళ్లను వణికించగల సత్తా బుమ్రా కు వందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రారంభంలో అతడు గనుక వికెట్లను పడగొడితే.. మిగతా పని ఇతర బౌలర్లైన జడేజా, అశ్విన్, వాషింగ్టన్ సుందర్ వంటి వారు చూసుకుంటారు. మహమ్మద్ సిరాజ్ ఇటీవల కాలంలో గొప్ప గణాంకాలను నమోదు చేయలేకపోయినప్పటికీ.. గత రికార్డు చూసుకుంటే.. అతడు రాణించే అవకాశం కనిపిస్తోంది. ఆస్ట్రేలియాపై మూడు మ్యాచ్ లు ఆడిన సిరాజ్.. 29.53 సగటుతో ఏకంగా 13 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇక తొలి టెస్ట్ జరిగే పెర్త్ స్పిన్ బౌలర్లకు అంతగా అనుకూలించకపోయినప్పటికీ.. మ్యాచ్ మొదలైన మూడో రోజు నుంచి మైదానం పూర్తిగా మారుతుందని క్యూరేటర్ చెబుతున్నారు. సో ఈ లెక్కన భారత బౌలర్లు రెట్టించిన ఉత్సాహంతో రాణించాల్సిన అవసరం ఉంది. ఆస్ట్రేలియాను త్వరగా అవుట్ చేసి.. ఆ తర్వాత బ్యాటర్లు తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తే పెర్త్ మన సొంతం అవడం పెద్ద విషయం కాదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.