Australian Cricketer : టి20 వరల్డ్ కప్ లో భాగంగా మంగళవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో ఆస్ట్రేలియా 24 పరుగుల తేడాతో ఓడిపోయింది.. ఈ గెలుపు ద్వారా భారత జట్టు దాదాపుగా ప్రతీకారం తీర్చుకుంది.. 2003, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాభవానికి గురైంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లోనూ ఆస్ట్రేలియా చేతిలో భారత్ భంగపాటుకు గురైంది. ఈ క్రమంలో ఆ మూడు ఓటములకు భారత్ మంగళవారం నాటి సూపర్ -8 మ్యాచ్ లో గెలుపొందడం ద్వారా రివెంజ్ తీర్చుకున్నట్టయింది.
ఈ ఓటమి నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 37 సంవత్సరాల డేవిడ్ వార్నర్ ఇప్పటికే టెస్ట్, వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. గత జనవరిలోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా టి20 క్రికెట్ నుంచి కూడా నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. టి20 వరల్డ్ కప్ లో భారత జట్టుతో జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత.. డేవిడ్ వార్నర్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అయితే ఈ టి20 వరల్డ్ కప్ తన కెరియర్ లో చివరిది కావచ్చని డేవిడ్ వార్నర్ గతంలోనే వెల్లడించాడు.. ఎడమచేతి వాటం బ్యాటింగ్ తో డేవిడ్ వార్నర్ సంచలనాలు సృష్టించాడు. బౌలర్లపై ఏమాత్రం కనికరం లేకుండా బ్యాటింగ్ చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు.. అతి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసే ఆటగాడిగా ఆస్ట్రేలియా జట్టులో పేరు గడించాడు. ఆస్ట్రేలియా జట్టు సాధించిన అనేక విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు.
ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ 110 అంతర్జాతీయ టీ 20 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో ఒక శతకం, 28 అర్ధ శతకాలు ఉన్నాయి. మొత్తంగా 3, 277 పరుగులు చేశాడు. పాకిస్తాన్ పై 2019లో జరిగిన మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. టెస్ట్, వన్డే, టి20 ఫార్మాట్ లలో సెంచరీలు చేసిన మూడవ ఆస్ట్రేలియా ఆటగాడిగా డేవిడ్ వార్నర్ ఘనత సాధించాడు. డేవిడ్ వార్నర్ ఐపీఎల్ టోర్నీ ద్వారా భారత అభిమానులకు దగ్గరయ్యాడు. 2021లో టి20 లీగ్స్ లో పదివేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు . 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఐపీఎల్ విజేతగా నిలిపాడు. అంతేకాదు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సినిమాలో పాటలకు స్టెప్పులు వేస్తూ అలరిస్తుంటాడు. డేవిడ్ వార్నర్ నిర్ణయంతో ఆస్ట్రేలియా అభిమానులు ఒకసారిగా షాక్ కు గురయ్యారు..” నీ ఆటను ఇకపై చూడలేమంటూ” సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.