https://oktelugu.com/

AUS vs NZ 1st Test: గ్రీన్ విధ్వంసం.. న్యూజిలాండ్ కకావికలం..

అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి 179 పరుగులకు ఆలౌట్ అయింది. సొంత మైదానంలో ఆడుతున్నప్పటికీ న్యూజిలాండ్ బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలర్లను ఏమాత్రం ప్రతిఘటించలేకపోయారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 1, 2024 / 12:40 PM IST
    Follow us on

    AUS vs NZ 1st Test: ఆడుతోంది సొంతమైదానంలో.. పైగా ఆస్ట్రేలియా అప్పటికే 9 వికెట్లు కోల్పోయింది.. ఇంకేముంది గురువారం నాటి ఓవర్ నైట్ స్కోర్ 279 పరుగులకు మహా అయితే 20 పరుగులు జత చేస్తుందనే అంచనాలున్నాయి. కానీ న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా ను నిలువరించలేకపోయింది. చివరి వికెట్ పడగొట్టడానికి ఆపసోపాలు పడింది. తొలి టెస్ట్ తొలి రోజు తొలి ఇన్నింగ్స్ లో నిప్పులు చెరిగే విధంగా బంతులు వేసిన న్యూజిలాండ్ బౌలర్లు.. రెండవ రోజు ఆటలో తేలిపోయారు. ముఖ్యంగా 103 పరుగులు చేసిన కెమెరూన్ గ్రీన్ దూకుడు ముందు తలవంచారు. చివరి వికెట్ కు హజిల్ వుడ్ తో కలిసి కామెరూన్ గ్రీన్ రికార్డు స్థాయిలో 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అదే సమయంలో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (174 నాట్ అవుట్) నమోదు చేశాడు. ఓవర్ నైట్ స్కోర్ 279 పరుగులతో రెండవ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 383 పరుగులకు ఆల్ అవుట్ అయింది. చివరి వికెట్ కు ఆస్ట్రేలియా జట్టు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం.

    అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి 179 పరుగులకు ఆలౌట్ అయింది. సొంత మైదానంలో ఆడుతున్నప్పటికీ న్యూజిలాండ్ బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలర్లను ఏమాత్రం ప్రతిఘటించలేకపోయారు. 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడిన న్యూజిలాండ్ జట్టును వికెట్ కీపర్ బ్లండిల్, ఫిలిప్స్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 84 పరుగులు జోడించారు. వీరు కనుక ఈ స్కోర్ చేసి ఉండకుంటే న్యూజిలాండ్ జట్టు 50 పరుగుల లోపే ఆల్ అవుట్ అయ్యేది.. న్యూజిలాండ్ స్కోర్ 113 పరుగుల వద్ద ఉన్నప్పుడు బ్లండిల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొంతసేపటికి కుగెల్ జెన్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో ఫిలిప్స్ బౌలర్ హెన్రీతో కలిసి ఎనిమిదో వికెట్ కు 48 పరుగులు జోడించాడు. ఆ తర్వాత హెన్రీ అవుట్ కావడం.. మిగతా బ్యాటర్లు కూడా త్వర త్వరగా నే పెవిలియన్ దారి పట్టడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 179 పరుగుల వద్ద ముగిసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో పిలిప్స్(71), హెన్రీ(42), బ్లండిల్(33) మాత్రమే రాణించారు..ఆస్ట్రేలియా బౌలర్లలో లయన్ నాలుగు వికెట్లు తీశాడు. హజిల్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, కమిన్స్, మార్ష్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. విలియంసన్, రచిన్ రవీంద్ర, కుగెల్ జిన్, ఓరూర్క్ డక్ ఔట్ కావడం విశేషం.

    అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు కడపటి వార్తలు అందే సమయానికి ఐదు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ బౌలర్ సౌతి స్టీవెన్ స్మిత్, లబూ షేన్ ను ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజ్ లో ఉస్మాన్ ఖవాజా, లయన్ ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్టుపై 211 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.. కాగా ఇటీవల జరిగిన 3 t20 ల సిరీస్ ను ఆస్ట్రేలియా చేతిలో 3-0 తేడాతో న్యూజిలాండ్ కోల్పోయింది. అది కూడా సొంత దేశంలో. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న విధానం చూస్తే న్యూజిలాండ్ చేతులోకి రావాలి అంటే అద్భుతం జరగాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.