Niharika Konidela: వంశీ తుమ్మల,హారిక బల్ల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా సాగు. ఈ సినిమాకు వినయ్ రత్నం దర్శకత్వం వహించగా యశస్వి వంగా నిర్మించారు. ప్రేమ, వివక్షతో నిండిపోయిన సమాజాన్ని ఎదురుస్తుందా? ఓడిస్తుందా? ఎటువంటి క్లిష్టమైన సవాలునైనా ఎదుర్కొంటుంది అనే అంశాలను ప్రధానంగా తీసుకొని వ్యవసాయం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించింది. ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చి మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ, టాటా స్కైబింగ్, ఎయిర్ టెల్ ఎక్స్ టీమ్, తదితరాల వాటిలో మార్చి 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలోనే గురువారం ఈ మూవీని హైదరాబాద్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు మేకర్స్. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కోసం చిత్రయూనిట్ సభ్యులతో పాటు నిహారిక కొణిదెల హాజరయ్యారు. స్క్రీనింగ్ అనంతరం మీడియాతో ముచ్చటించింది టీమ్. ఈ సందర్భంగా నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయని.. వాటన్నింటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాలని అన్నారు. సాగు సినిమా నా మనసుకు చాలా దగ్గరైంది. హృదయాన్ని హత్తుకున్న మూవీ ఇది.
ఇంతకముందు ఓసారి ఈ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించినప్పుడు నేను అతిథిగా హాజరయ్యాను.. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కానీ వాటి గురించి బాధపడకుండా ముందుకెళ్లాలని తెలియజేసే ఈ మూవీకి కెనక్ట్ అయ్యాను. సమస్యను ఎదురైనప్పుడు ఒక అడుగులో ఓటమిని అంగీకరించకూడదు అని అందరికీ అర్థమయ్యేలా చెప్పే సినిమా ఇది అంటూ తెలిపింది. నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. అలాగే రైతుల కష్టాన్ని వారి విలువలను చాటి చెబుతుంది. కుటుంబ ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధించవచ్చు. నాకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని అన్నారు.
52 నిమిషాలున్న ఈ షార్ట్ ఫిల్మ్ ను 4 రోజుల్లో చిత్రీకరించారని.. ఇలాంటి యంగ్ టీం ను సపోర్ట్ చేయడం ఎప్పుడు ఆనందంగానే ఉంటుందని.. ఇంత మంచి ప్రాజెక్ట్ నా వద్దకు తీసుకొచ్చిన అంకిత్ కు థాంక్స్ అంటూ తెలిపింది నిహారిక. ఇలాంటి సబ్జెక్ట్ తీసినందుకు చాలా ఆనందంగా ఉంది. రైతుల కష్టాన్ని దగ్గరుండి చూడలేదు. కానీ వారి కష్టాన్ని తెలిపే సినిమాను తీసుకురావడం చాలా సంతోషం అంటూ మాట్లాడింది నిహారిక.