https://oktelugu.com/

Jio Cinema: ముఖేష్ అంబానీ జియో సినిమా.. మిగతా ఓటీటీలకు సినిమా చూపిస్తోంది..

జియో సినిమా రాకతో పోటీ సంస్థలైన అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, ఆహా వంటి సంస్థలు నష్టాలను నమోదు చేస్తున్నాయి. వరల్డ్ వైడ్ కంటెంట్, విస్తృతమైన సినిమాలు ఉండటం వల్ల జియో సినిమా నుంచి నెట్ ఫ్లిక్స్ తనను తను కాపాడుకుంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 1, 2024 / 12:43 PM IST
    Follow us on

    Jio Cinema: ఒక ఉత్పత్తిని వినియోగదారులకు చేరువ చేయాలంటే.. ముందుగా దానిని వాడటం అలవాటు చేయాలి. ఒకసారి దానికి వారు అలవాటు పడ్డ తర్వాత…అది ఏ రూపంలో ఉన్నా, ధర ఏ స్థాయిలో ఉన్నా కొనుగోలు చేస్తుంటారు. ఇదే సూత్రాన్ని ముఖేష్ అంబానీ తన జియో ప్రారంభం సమయంలో అమల్లో పెట్టాడు. ఫలితంగా అది భారతి ఎయిర్ టెల్ వంటి కంపెనీకి చెక్ పెట్టగలిగింది. ఆ జియో ప్రభావం వల్ల వోడాఫోన్ లాంటి సంస్థ ఆదిత్య గ్రూపులో విలీనం కావాల్సి వచ్చింది. చివరికి అనిల్ అంబానీ కూడా తన రిలయన్స్ ఇన్ఫోను జియోలో కలపాల్సి వచ్చింది. టెలికాం రంగంలో జియో ప్రభంజనం.. మిగతా రంగాలకు కూడా విస్తరించింది. జియో వినోద రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. జియో సినిమా పేరుతో ఓటీటీ రంగంలోకి ప్రవేశించింది..

    జియో సినిమా రాకతో పోటీ సంస్థలైన అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, ఆహా వంటి సంస్థలు నష్టాలను నమోదు చేస్తున్నాయి. వరల్డ్ వైడ్ కంటెంట్, విస్తృతమైన సినిమాలు ఉండటం వల్ల జియో సినిమా నుంచి నెట్ ఫ్లిక్స్ తనను తను కాపాడుకుంది. లేకుంటే ఆ సంస్థ కూడా నష్టాలు నమోదు చేసేదే. జియో సినిమా కు సబ్ స్క్రైబర్లు మళ్ళకుండా ఉండేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏకంగా ఇటీవల వరల్డ్ కప్ మ్యాచ్లను ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది. అయినప్పటికీ అది నష్టాల నుంచి కోలుకోలేకపోయింది. జియో సినిమా గత ఏడాది ఐపీఎల్ ప్రసార హక్కులు దక్కించుకున్న నేపథ్యంలో.. తన సబ్స్క్రైబర్లకు ఉచితంగా ఆ మ్యాచులు చూసే అవకాశం కల్పించింది. ఇది ఇతర పోటీ ఓటీటీలకు ప్రతిబంధకంగా మారింది. దీంతో అప్పట్లో జియో సినిమాకు భారీగా సబ్ స్క్రైబర్లు పెరిగారు. వాస్తవానికి ఓటీటీ సంస్థలకు సబ్ స్క్రైబర్లు, ఇతర వ్యాపార ప్రకటనల ద్వారా ఆదాయం వస్తుంది. అయితే జియో సినిమాకు వస్తున్న స్థాయిలో మిగతా ఓటీటీ సంస్థలకు ప్రకటనలు రావడం లేదు. పైగా జియో సినిమా విపరీతమైన కంటెంట్ అందుబాటులో ఉంచుతోంది. కొరియన్, చైనా, హాలీవుడ్ డ్రామా సిరీస్ లతో సబ్స్క్రైబర్ల మనసు చూరగొంటోంది. ఇది మిగతా సంస్థలకు ప్రతిబంధకంగా నిలుస్తోంది.

    మనదేశంలో 2017 నుంచి వీడియో ఓటిటి వెలుగులోకి వచ్చింది. మొదట్లో అమెజాన్ ప్రైమ్ మాత్రమే ఈ రంగంలో ఉండేది. తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వచ్చింది. హాట్ స్టార్ అనంతరం “జీ ” ఈ రంగంలోకి ప్రవేశించింది. తెలుగు, తమిళంలో ఆహా పేరుతో సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ ఓటీటీ వేదికను ప్రారంభించారు. అయితే విపరీతమైన పోటీ వల్ల వీటికి ఆనుకున్నంత స్థాయిలో ఆదాయం రావడం లేదు. పైగా జియో సినిమా రాకతో ఇవన్నీ తీవ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాయి. ఆహా ఓటీటీని అమ్మేందుకు అల్లు అరవింద్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సినీ సర్కిల్లో చర్చ నడుస్తోంది. ఇక ఇటీవల రిలయన్స్ వయా కామ్, వాల్ట్ డిస్నీ చేతులు కలపడంతో.. వచ్చే రోజుల్లో ఓటీటీ లకు మరింత గడ్డుకాలం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ జీ, సోనీ విలీనం అయితే.. అప్పుడు మార్కెట్లో రిలయన్స్ డిస్నీ, జీ, సోనీ మాత్రమే ఉంటాయని.. మిగతావన్నీ విలీనమవుతాయని తెలుస్తోంది.