Asia Cup Final 2025: 41 సంవత్సరాల తర్వాత ఆసియా కప్ ఫైనల్లోకి పాకిస్తాన్, టీమిండియా వెళ్లిపోయాయి. గత సీజన్లో టీమిండియా ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఈసారి కూడా అదే స్థాయిలో ఆట తీరు ప్రదర్శించి విజేతగా నిలవాలని భావిస్తోంది. దీనికి తగ్గట్టుగానే మేనేజ్మెంట్ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పటికే లీగ్, సూపర్ 4 దశలలో జరిగిన మ్యాచ్లలో టీమిండియా పాకిస్తాన్ జట్టు మీద అద్భుతమైన విజయాలను అందుకుంది. ఫైనల్ మ్యాచ్లో కూడా అదే జోరు చూపించాలని భావిస్తోంది.
పాకిస్తాన్ జట్టు భారత జట్టుతో పోలిస్తే అంత గొప్పగా కనిపించకపోయినప్పటికీ.. గుంట నక్కలాంటి పాకిస్తాన్ జట్టును ఎప్పటికీ నమ్మకూడదు. ఎందుకంటే 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ దీనికి ప్రధాన ఉదాహరణ. 2017లో ఇంగ్లాండ్ జట్టులో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. పాకిస్తాన్ జట్టు, భారత జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడాయి. దానికంటే ముందు లీగ్ మ్యాచ్ కూడా జరిగింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన భారత్ 48 ఓవర్లకు 319 పరుగులు చేసింది. నాటి మ్యాచ్లో యువరాజ్, ధోని, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి లెజెండరీ ప్లేయర్లు ఉన్నారు. 319 పరుగులను చేదించే క్రమంలో పాకిస్తాన్ జట్టు 164 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత ఈ రెండు జట్లు ఫైనల్ వెళ్లిపోయాయి. ఫైనల్ మ్యాచ్లో మాత్రం భారత జట్టుకు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ 338 పరుగులు చేసింది. భారత్ మాత్రం 158 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్లో అప్పటి పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ 114 పరుగులతో అదరగొట్టాడు. మరోవైపు పాకిస్తాన్ పేస్ బౌలర్ మహమ్మద్ అమీర్ 3/16 వికెట్లు పడగొట్టాడు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఔట్ చేశాడు. మరోపేష్ బౌలర్ హాసన్ అలీ మూడు వికెట్లు నేల కూల్చాడు. వాస్తవానికి ఈ ఓటమి చాలా సంవత్సరాలు టీమిండియాను వెంటాడింది.
వాస్తవానికి పాకిస్తాన్ అనేది చాలా విచిత్రమైన జట్టు. ఏ సమయానికి ఎలా ఆడుతుందో ఆ జట్టుకే తెలియదు. ప్లేయర్లు ఎప్పుడు ఫామ్ లోకి వస్తారో ఒక పట్టాన అర్థం కాదు. అందువల్లే 2017 నాటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని టీమిండియా ఆసియా ఫైనల్ కప్ ఆడాల్సి ఉంటుంది. ఏమాత్రం పాకిస్తాన్ జట్టుకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక లోపాలు బయటపడినప్పటికీ.. ఒకరిద్దరు ప్లేయర్లు సమయోచితంగా ఆడి టీమ్ ఇండియాకు విజయాలు అందించారు. ఫైనల్ మ్యాచ్లో ఫీల్డింగు లోపాలను టీమిండియా వదిలేసుకోవాలి. అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో కూడా మార్పులు చేయాలి. ముఖ్యంగా గిల్, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. అభిషేక్ శర్మ మీదనే భారం వేయకుండా.. మిగతా ప్లేయర్లు కూడా తమ వంతు బాధ్యతగా ఆడాలి. అప్పుడే టీమ్ ఇండియా మరోసారి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ట్రోఫీ కూడా దక్కించుకుంటుంది.