Ind Vs Pak Asia Cup Final: 41 సంవత్సరాల ఆసియా కప్ చరిత్రలో తొలిసారి పాకిస్తాన్, భారత్ ఫైనల్ వెళ్ళిపోయాయి.. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉందని అంచనాలున్నాయి. లీగ్, సూపర్ 4 దశలలో జరిగిన మ్యాచ్లలో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. వాస్తవానికి ఆసియా కప్ లో లీగ్ దశ నుంచి నిన్నటి శ్రీలంకతో జరిగిన మ్యాచ్ వరకు భారత వరుస విజయాలు సాధించింది. మరోసారి టైటిల్ నెగ్గడానికి అడుగు దూరంలో ఉంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును మరొకసారి ఓడించి చరిత్ర సృష్టించాలని భారత జట్టు భావిస్తోంది.
ఫైనల్ మ్యాచ్ జరగడానికి ఒకరోజు మాత్రమే గడువు ఉంది. శుక్రవారంతో సూపర్ ఫోర్ మ్యాచులు ముగిసిపోయాయి. శుక్రవారం శ్రీలంక జట్టుతో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో టీమ్ ఇండియా ప్లేయర్లు హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ గాయపడ్డారు. సూపర్ హాఫ్ సెంచరీ తర్వాత అభిషేక్ శర్మ ఫీల్డింగ్ చేయడానికి మైదానంలోకి రాలేదు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా తొలి ఓవర్ వేసి.. ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే అతడు కూడా తొడ కండరాలు పట్టడంతో మైదానంలోకి రాలేదు. దీంతో రింకూ సింగ్, శివం దుబే సబ్ స్ట్యూట్ ఫీల్డర్లుగా మైదానంలోకి వచ్చారు. రింకు సింగ్ అద్భుతమైన క్యాచ్ పట్టి అదరగొట్టాడు.
ప్రస్తుత ఆసియా కప్ సిరీస్లో అభిషేక్ శర్మ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. టీమిండియా ప్లేయర్లు మొత్తం విఫలమవుతున్నప్పటికీ అతడు మాత్రం నిలబడుతున్నాడు. భారత జట్టు ఇప్పటివరకు సూపర్ 4 మ్యాచ్ లలో అన్నీ గెలిచిందంటే దానికి ప్రధాన కారణం అభిషేక్ శర్మ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అభిషేక్ శర్మకు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ ఆడే విషయంలో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా ఆడతాడా? లేడా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. హార్దిక్ పాండ్యాకు గాయం అంత పెద్దది కాదని.. శనివారం నాటికి అతడు కోలుకుంటాడని.. అభిషేక్ శర్మ కూడా అందుబాటులోకి వస్తాడని జట్టు వర్గాలు చెబుతున్నాయి. శనివారం నెట్ సెషన్ కాకుండా, మసాజ్ సెషన్ మాత్రమే నిర్వహిస్తామని జట్టు వర్గాలు చెబుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ కు అభిషేక్ శర్మ దూరమైతే జట్టుకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి.. మేనేజ్మెంట్ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.