Asia Cup 2025: మరికొద్ది రోజుల్లో ఆసియా కప్ మొదలు కాబోతోంది. ఇప్పటికే టీమ్ ఇండియా టోర్నీ నిర్వహించే దేశానికి వెళ్లిపోయింది. అక్కడ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత ఆసియా కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈసారి కూడా విజయాన్ని సాధించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆటగాళ్ల ఫాం ప్రకారం చూసుకుంటే ఆసియా కప్ గెలవడం టీమిండియా కు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో టీమిండియా సీక్రెట్ ను బయటపెట్టాడు లెజెండ్రీ క్రికెటర్ గవాస్కర్.
ఓ ప్రైవేట్ స్పోర్ట్స్ ఛానల్ కు గవాస్కర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా భారత జట్టుకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించాడు..” టీమిండియా యువ రక్తంతో కనిపిస్తోంది. బుమ్రా, కులదీప్ యాదవ్, సూర్య కుమార్ యాదవ్ లాంటి సీనియర్లు ప్రధాన బలంగా ఉంటారు. సంజు శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత బలంగా ఉంది. బౌలింగ్ విషయంలో కూడా అలానే కనిపిస్తోంది.. అర్ష్ దీప్ సింగ్ వంటి యువ బౌలర్ భారత జట్టుకు ప్రధాన ఆయుధంగా ఉంటాడు. గిల్ కూడా సమర్థవంతంగా బ్యాటింగ్ చేస్తాడు. అక్షర్ పటేల్ వంటి డిఫరెంట్ బౌలర్ కూడా భారత జట్టుకు బలం. ఇంత గొప్పగా కనిపిస్తోంది కాబట్టి టీమిండియా ఒకవేళ ఆసియా కప్ గెలవకపోతే ఆశ్చర్యమేనని” సునీల్ పేర్కొన్నాడు.
వరుస విజయాలతో
“ఇటీవల టి20 ఫార్మాట్లో టీమ్ ఇండియా వరుసవిద్యాల సాధిస్తోంది. టోర్నీలు మొత్తం గెలుచుకుంటున్నది. ఇదంతా శుభసూచకం. పొట్టి ప్రపంచ కప్ నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు టీమిండియా ఎందులో కూడా ఓటమిపాలు కాలేదు. పైగా ఆటగాళ్లలో ఒకప్పటితో పోల్చి చూస్తే విపరీతమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. అదే జట్టు అసలైన సీక్రెట్. ఆ సీక్రెట్ చివరి వరకు కొనసాగిస్తే టీమిండియా కు తిరుగులేదు. యూఏఈ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ప్రారంభం నుంచి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగిస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ అదే జరిగితే టీం ఇండియాకు తిరుగులేదు. అంతేకాదు ఆసియా కప్ లో కూడా టీమిండియా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని” గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.