Ashes 1st Test Highlights: జింక వేగంగా పరిగెడుతుంది. దాని వేగాన్ని అంచనా వేసి పులి వేటకు దిగుతుంది. జింక లోపాలు ఏమిటో సంపూర్ణంగా పరిశీలిస్తుంది పులి. ఆ తర్వాత జింకను పరుగులు పెట్టించి పెట్టించి వేటాడుతుంది. అత్యంత లాగవంగా దాని గొంతును పట్టేసుకుని చంపేస్తుంది. వేడివేడి నెత్తురును తాగి.. తన పదునైన దంతాలతో చీల్చి చీల్చి మాంసాన్ని తింటుంది. వాస్తవానికి జింక పులి కంటే వేగంగా పరుగులు తీస్తుంది. కానీ పులికి వేటాడడం తెలుసు కాబట్టి జింకను చంపేస్తుంది.
పై ఉపోద్ఘాతంలో జింక ఇంగ్లాండ్ జట్టు అయితే.. పులి ఆస్ట్రేలియా జట్టు. క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం ఈనాటిది కాదు. వారు ఒక మ్యాచ్ ఓడిపోయారు అంటే తదుపరి మ్యాచ్ లో కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. పైగా ప్రతి విషయాన్ని కూడా ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఆటగాడు సరైన ఫామ్ లో లేకుంటే మొహమాటం లేకుండా బయటికి పంపిస్తుంది. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపిస్తేనే మళ్లీ జాతీయ జట్టులో అవకాశం కల్పిస్తుంది. అందువల్లే ఆస్ట్రేలియా జట్టులో టాప్ వన్ నుంచి నైన్ వరకు ప్రతి ఆటగాడు బ్యాటింగ్ చేస్తాడు. దురదృష్టం వెంటాడితే తప్ప జట్టు ఓటమిని ఒప్పుకోదు.
ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ ను పరిశీలిస్తే.. ముఖ్యంగా పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా సాధించిన విజయాన్ని అత్యంత లోతుగా అధ్యయనం చేస్తే కంగారు జట్టు బలం ఏమిటో తెలిసిపోతుంది. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 132 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా కంటే ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇనింగ్స్ లో 172 పరుగులు చేసింది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 40 పరుగుల లీడ్ సాధించింది. కానీ ఈ లీడ్ ను రెండవ ఇన్నింగ్స్ లో కొనసాగించడంలో ఇంగ్లాండ్ జట్టు విఫలం అయింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు గాయపడ్డ బెబ్బులి మాదిరిగా దూకుడు కొనసాగించింది. తొలి ఇన్నింగ్స్ లో 40 పరుగుల లోటు.. ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ లో సాధించిన 164 పరుగులు.. మొత్తంగా 205 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగింది ఆస్ట్రేలియా జట్టు. వాస్తవానికి పిచ్ వికెట్లకు స్వర్గధామం గా మారిన సందర్భంలో ఆస్ట్రేలియా జట్టు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ముఖ్యంగా హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తను ఆడుతోంది టెస్ట్ అని మర్చిపోయి.. టి20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. 83 బంతుల్లో 123 పరుగులు చేసి పెర్త్ మైదానాన్ని హోరెత్తించాడు.
వికెట్లు పడుతున్నచోట.. బంతులు దూసుకు వస్తున్నచోట హెడ్ ఆ స్థాయిలో బ్యాటింగ్ చేశాడంటే మామూలు విషయం కాదు. హెడ్ దూకుడు వల్ల ఆస్ట్రేలియా జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది. అది కూడా ఓవర్ కు 7 పరుగులకు మించి రన్ రేట్తో గెలుపును దక్కించుకుంది. సాధారణంగా ఆస్ట్రేలియా వెనకడుగు వేసిందంటే వెనక్కి వెళ్లిపోయినట్టు కాదు.. అంతకు మించిన వేగంతో దూసుకు వస్తుందని దాని అర్థం.. ఇంగ్లాండ్ జట్టుకు పెర్త్ టెస్టులో అది అర్థమైంది. ఈ ఓటమిని గుణపాఠంగా మార్చుకొని తదుపరి మ్యాచ్లలో ఇంగ్లాండ్ జట్టు అదరగొడితే యాషెస్ సొంతమవుతుంది. లేకుంటే కంగారు జట్టు చేతిలో ఒదిగిపోతుంది. ఇప్పుడు ఏది కావాలో తేల్చుకోవాల్సిన బాధ్యత స్టోక్స్ మీద ఉంది.