AUS vs ENG Highlights: యాషెస్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం సాధించే కనిపిస్తోంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. పిచ్ బౌలింగ్ కు సహకరిస్తున్న క్రమంలో.. తొలి రోజు 19 వికెట్లు నేలకూలాయి. రెండవ రోజు 11 వికెట్లు పడిపోయాయి.
బౌలర్లకు స్వర్గ ధామంగా మారిపోయిన ఈ పిచ్ మీద ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ బలంగా నిలబడ్డాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగో నెంబర్ లో వచ్చిన ఈ ఆటగాడు.. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం ఓపెనర్ గా వచ్చాడు. టెస్ట్ మ్యాచ్ ను టి20 తరహాలో ఆడాడు. తీవ్రమైన ఒత్తిడిలో.. బంతులు బులెట్ల మాదిరిగా దూసుకు వస్తున్న తరుణంలో బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. భయం అనేది లేకుండా.. వికెట్ పడిపోతుందనే ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఒకరకంగా టెస్టు లో టి20 తరహాలో పరుగులు సాధించాడు. చూస్తుండగానే సెంచరీ సాధించి.. మ్యాచ్ ను ఇంగ్లాండ్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు.
స్టోక్స్, ఆర్చర్, అట్కిన్సన్, కార్సే ఇలా టాప్ బౌలర్ల బౌలింగ్ మాత్రమే కాదు.. కెప్టెన్ స్టోక్స్ బౌలింగ్ ను కూడా ఉతికి ఆరేశాడు. ఓవర్ కు ఏడుకు మించి పరుగులు చేసి ఇంగ్లాండ్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు హెడ్. పెర్త్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 172 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 132 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు 164 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా ఆస్ట్రేలియా ఎదుట 205 పరుగుల లక్ష్యాన్ని విధించింది.. ఈ లక్ష్యాన్ని ఫినిష్ చేసే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు వీర విహారం చేసింది. బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న ఈ మైదానంపై ఆస్ట్రేలియా ఆటగాళ్లు ముఖ్యంగా హెడ్ దుమ్మురేపాడు.. కేవలం 83 బంతులలోనే అతడు 123 పరుగులు చేశాడు. ఇందులో 16 బౌండరీలు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. మరో ఆటగాడు లబూ షేన్ 49 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
హెడ్ దూకుడు వల్ల ఇంగ్లాండ్ జట్టు విధించిన 205 పరుగుల లక్ష్యం చూస్తుండగానే కరిగిపోయింది.. వాస్తవానికి తొలి రోజు, రెండవ రోజు మధ్యాహ్నం వరకు పెర్త్ పిచ్ పై వికెట్ల జాతర కొనసాగింది. కానీ ఎప్పుడైతే ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ మొదలైందో.. హెడ్ ఓపెనర్ గా వచ్చాడో పరిస్థితి మారిపోయింది.. ఒత్తిడిలో.. బీభత్సంగా ఆడాడు హెడ్. అత్యంత బలవంతమైన ఇంగ్లాండ్ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. ముఖ్యంగా కెప్టెన్ స్టోక్స్ బౌలింగ్లో వరసగా బౌండరీలు కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు.. మామూలుగా అయితే ఆటగాళ్లు తమకు అనుకూలంగా వాతావరణం ఉన్నప్పుడు బీభత్సంగా బ్యాటింగ్ చేస్తారు.. కానీ హెడ్ అలా కాదు.. తనకు అనుకూలంగా లేనిచోట బ్యాటింగ్ చేస్తాడు. పరుగుల వరద పారిస్తాడు. పెర్త్ టెస్ట్ నిరూపించింది. ఇప్పుడు మాత్రమే కాదు హెడ్ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, అదే ఏడాది జరిగిన వరల టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్, గత ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో .. ఇలా ప్రతి సందర్భంలోనూ సెంచరీ చేసి అదరగొట్టాడు హెడ్.