Homeక్రీడలుArshdeep Singh: మొన్న వికెట్ విరగొట్టాడు.. ఈ రోజు చెత్త రికార్డ్ నమోదు చేసిన పేస్...

Arshdeep Singh: మొన్న వికెట్ విరగొట్టాడు.. ఈ రోజు చెత్త రికార్డ్ నమోదు చేసిన పేస్ బౌలర్..!

Arshdeep Singh: క్రికెట్ లో తమదైన రోజున చెలరేగిపోయి హీరోలుగా మారుతుంటారు ఎంతో మంది. అదే హీరోలు తమది కాని రోజున జీరోలుగా మారి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితే పంజాబ్ కింగ్స్ జట్టు బౌలర్ అర్షదీప్ సింగ్ ఎదుర్కొంటున్నాడు. ముంబైతో కొద్ది రోజుల కిందట జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ లో అద్భుత బౌలింగ్ చేసి రెండు వికెట్లు విరగొట్టిన ఈ బౌలర్.. లక్నోతో జరిగిన మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని విమర్శలు పాలయ్యాడు.

గొప్పగా రాణించిన రోజు పూల వర్షం.. ఘోరంగా ఫెయిల్ అయిన రోజున విమర్శల జడివాన. ఏ రంగంలోనైనా ఇది సర్వసాధారణం. అయితే క్రికెట్ లో ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏ రోజు కా రోజు సత్తాను చాటుకోవాల్సిన పరిస్థితి క్రికెటర్లకు ఉంటుంది. ఈరోజు రాణించిన ఆటగాడే మరుసటి రోజు ఫెయిల్ అయి విమర్శలకు గురికావాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితినే ప్రస్తుతం పంజాబ్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఎదుర్కొంటున్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు విరగొట్టి బీసీసీఐకి రూ.30 లక్షల రూపాయల నష్టాలు చేకూర్చిన ఈ బౌలర్.. లక్నోతో జరిగిన మ్యాచ్ లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని విమర్శలు పాలయ్యాడు.

అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో పంజాబ్ జట్టుకు విజయం..

గతవారం పంజాబ్ జట్టు ముంబై ఇండియన్స్ జట్టుతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 214 పరుగులు చేసింది. 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు చివరి ఓవర్ వరకు పోరాడి 201 పరుగులకే పరిమితమైంది. దీంతో ముంబై జట్టు 13 పరుగులు తేడాతో ఓటమి పాలయ్యింది. చివరి ఓవర్ లో విజయానికి 16 పరుగులు అవసరమైన దశలో బౌలింగ్ కు వచ్చాడు అర్షదీప్ సింగ్. క్రీజులో హిట్టర్లు టిమ్ డేవిడ్, తిలక్ వర్మ ఉన్నారు. సాధారణంగా మరో బౌలర్ అయితే మ్యాచ్ రూపు మరో విధంగా మారేది. కానీ అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవర్ లో రెండో బంతిని యార్కర్ వేసిన అర్షదీప్ సింగ్.. తిలక్ వర్మ ను బౌల్డ్ చేశాడు. వేగంగా వేసిన ఈ బంతికి మిడిల్ వికెట్ పూర్తిగా విరిగిపోయింది. ఆ తరువాత వేసిన మరో బంతికి కూడా వధిరా (0) బౌల్డ్ అయ్యాడు. వికెట్ కూడా విరిగిపోయింది. రెండు వికెట్లు విరిగిపోవడంతో బీసీసీఐకి సుమారు 30 లక్షల రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారీగా పరుగులు సమర్పించుకున్న అర్షదీప్ సింగ్..

లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో శుక్రవారం పంజాబ్ జట్టు మ్యాచ్ ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 257 పరుగులు చేసింది. భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 201 పరుగులకే 10 వికెట్లు కోల్పోయింది. 56 పరుగులు తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లు చేతులెత్తేశారు. ప్రతి బౌలర్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరీ ముఖ్యంగా గతంలో ముంబైతో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన అర్షదీప్ సింగ్.. ఈ మ్యాచ్ లో ఘోరంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఈ మ్యాచ్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు అర్షదీప్ సింగ్. గతంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 47 పరుగులు మాత్రమే ఇచ్చిన అర్షదీప్ సింగ్.. నిన్నటి మ్యాచ్ లో 54 పరుగుల సమర్పించుకొని ఆ రికార్డును తుడిచేశాడు. దీంతో అర్షదీప్ సింగ్ ప్రదర్శన పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంచి టెక్నిక్ ఉన్న బౌలర్ అయినప్పటికీ.. ఇంత దారుణమైన ప్రదర్శన ఎలా చేశాడని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version