Bareddy Anusha Cricketer: ఆమెది సాధారణ వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి కూడా ఒకప్పుడు వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి వారి కుటుంబానికి అండగా నిలబడింది. అదే అమ్మాయి ఈ రోజు జాతీయస్థాయి మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లికి చెందిన అనూష బారెడి. ఈ నెల 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్‌తో జరిగే టోర్నీలో టీమిండియా తరఫున ప్రాతినిథ్యం వహించనుంది.
ఆల్‌రౌండర్‌గా రాణింపు..
అనూష ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది. ఎడమ చేతి స్పిన్నర్, బ్యాటర్ అయిన అనూష తన ప్రతిభతో అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టులో స్థానం పొందింది. బుధవారం ఎంపిక చేసిన జట్టులో సెలక్టర్లు అనూషను ఎంపిక చేశారు. జాతీయ క్రికెట్ టోర్నీలో అనూష అద్భుత ప్రతిభ కనబర్చి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. అనూష ఇంతకుముందే హాంగ్‌కాంగ్ లో జరిగిన అండర్ 19 టోర్నీలో పాల్గొని కనబరిచింది.
గ్రామీణ క్రీడల్లో మొదటిసారి..
అనంతపురం నగరంలోని ఆర్డిటి సమస్త వారు గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే గ్రామీణ స్థాయి క్రికెట్ పోటీలలో మొదటిసారిగా అనూష పాల్గొంది. అక్కడ కనబరిచిన ప్రతిభ వల్ల ఆమెను ఆర్టీటీసంస్థవారు 2014లో అనంతపురం ఆర్డీటీ అకాడమీలోకి తీసుకున్నారు. అప్పటినుంచి అంచెలంచెలుగా ఎదిగి టీంఇండియాకు సెలక్ట్ అయింది.
మహిళా క్రికెటర్లు వెలుగులోకి రావడం అరుదు..
మహిళా క్రికెటర్లు వెలుగులోకి రావడం అరుదు.. అదీ తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తక్కువ మంది టీమిండియాకు ఆడారు. ఈ క్రమంలో అనూష మట్టిలో మాణిక్యంలా వెలుగులోకి వచ్చింది. భారత దేశానికి ఆడే అవకాశం రావడం గర్వంగా ఉందని అనూష పేర్కొంటోంది.