Ambati Rayudu Retirement: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ పూర్తయింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్వితీయమైన విజయాన్ని నమోదు చేయడంతో టైటిల్ కైవసం చేసుకుంది. ఈ జట్టులో ఆటగాడిగా ఉన్న అంబటి రాయుడు మ్యాచ్ ముందు రోజు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైనల్ మ్యాచ్ లో కూడా అంబటి రాయుడు వేగంగా ఆడి మంచి పరుగులు చేయడంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చెన్నై జట్టు విజయం అనంతరం కప్ అందించిన సమయంలో కూడా ధోని అంబటి రాయుడు, జడేజా ఆ కప్ తీసుకునేలా అవకాశం కల్పించడం ద్వారా వారికి గౌరవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అంబటి రాయుడు రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ కు దూరం అవుతుండడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వుయ్ విల్ మిస్ యూ ఛాంపియన్ అంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తెలుగు రాష్ట్రాల నుంచి గత కొన్ని సీజన్లో నుంచి అద్భుతంగా రాణిస్తున్న ఏకైక ఆటగాడు అంబటి రాయుడు అని మాత్రమే చెప్పవచ్చు. మరే క్రికెటర్ కి సాధ్యం కాని విధంగా ఆరు ఐపీఎల్ టోర్నీలు గెలిచిన జట్లలో అంబటి రాయుడు సభ్యుడుగా ఉండడం గర్వించదగ్గ విషయంగానే భావించాలి. అటువంటి అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక గొప్ప క్రికెటర్ ని మిస్ అవుతున్నామంటూ సామాజిక మాధ్యమాలు వేదికగా అభిమానాన్ని తెలియజేస్తున్నారు.
ఛాంపియన్ ను మిస్ అవుతున్నామంటూ అభిమానుల ఆవేదన..
అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, గుజరాత్ టైటాన్స్ తో ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో అంబటి రాయుడు శర వేగంగా ఆడి 8 బంతుల్లోనే 19 పరుగులు చేశాడు. ఈ పరుగులు కూడా చెన్నై జట్టు విజయం సాధించడంలో కీలకంగా మారాయి. చెన్నై జట్టు కప్ సాధించిన తర్వాత ధోని దాన్ని తీసుకునే అవకాశాన్ని రాయుడుకు అందించి అతనికి గౌరవాన్ని కల్పించాడు. తాజాగా ఐపీఎల్ ముగిసిన తర్వాత సామాజిక మాధ్యమాల వేదికగా అంబటి రాయుడును మిస్ అవుతున్నామంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు సార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జట్టులో భాగంగా ఉన్న రాయుడు లేకపోవడం అభిమానులకు ఇబ్బంది కలిగించే అంశమని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. యు ఆర్ ఛాంపియన్ అంటూ పెద్ద ఎత్తున రాయుడుకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.
అద్భుతమైన ఆట తీరు జట్టులో కీలకంగా మారి..
ఐపీఎల్ కెరియర్ లో అంబటి రాయుడు అద్భుతమైన ఆట తీరును కనబరిచాడు. ఐపిఎల్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు మాత్రమే అంబటి రాయుడు ఆడి ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2010 నుంచి ఐపీఎల్ లో అంబటి రాయుడు ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 205 మ్యాచులు ఆడిన రాయుడు.. 127.29 స్ట్రైక్ రేటుతో 4348 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 100 పరుగులు కాగా, 22 అర్థ సెంచరీలు ఉన్నాయి. 2018 సీజన్లో అత్యధికంగా 602 పరుగులు చేశాడు అంబటి రాయుడు. 2017, 2023 సీజన్లు మినహా మిగిలిన అన్ని సీజన్లోనూ అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. మొత్తంగా ఐపీఎల్ లో 28.29 యావరేజ్ తో రాయుడు పరుగులు చేశాడు. ఈ ఏడాది 16 మ్యాచులు ఆడినప్పటికీ 158 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 27 పరుగులు కావడం గమనార్హం. ఫైనల్ మ్యాచ్ లో అంబటి రాయుడు ఎనిమిది బంతుల్లోనే 19 పరుగులు చేసి విజయానికి దోహదం చేశాడు.
Web Title: Ambati rayudus fans are expressing their grief after announcing his retirement
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com