Virat Kohli : ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన నేపథ్యంలో.. బెంగళూరు జట్టు వరుసగా మూడు విజయాలు అందుకుంది. అంతకుముందు జరిగిన మ్యాచ్ లలో వరుసగా ఓటమిపాలై.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆటగాళ్లు ఒక్కసారిగా తమ ఆట తీరు మార్చుకున్నారు.. వరుసగా మూడు మ్యాచ్ లలో విజయాలు అందుకొని, ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు.. పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి ఏడవ స్థానానికి ఏకబాకారు. నెట్ రన్ రేట్ ను మరింత మెరుగుపరుచుకున్నారు.
ముఖ్యంగా శనివారం రాత్రి గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించారు. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 19.3 ఓవర్లలో 147 రన్స్ కే ఆల్ అవుట్ అయింది. గుజరాత్ జట్టులో షారుఖ్ ఖాన్ 37 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.. బెంగళూరు బౌలర్లలో యష్ దయాల్, విజయ్ వైశాఖ్, మహమ్మద్ సిరాజ్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ లక్ష్యాన్ని బెంగళూరు 13.4 ఓవర్లలో, 6 వికెట్లు నష్టపోయి సాధించింది. చేజింగ్ లో బెంగళూరు కెప్టెన్ డూ ప్లేసిస్ 64, విరాట్ కోహ్లీ 42 రన్స్ చేసి అదరగొట్టారు. గుజరాత్ లిటిల్ నాలుగు వికెట్లు అందుకున్నాడు.
ఈ విజయాన్ని బెంగళూరు జట్టు సెలబ్రేట్ చేసుకుంటుంటే.. మాజీ క్రికెటర్ అజయ్ జడేజా మాత్రం మరో విధంగా స్పందిస్తున్నాడు. ఈ విజయం బెంగళూరుకు సాంత్వన మాత్రమే ఇస్తుందని.. ప్లే ఆఫ్ చేరే అవకాశం ఇప్పుడే చెప్పలేమని అన్నాడు. ” బెంగళూరు మొన్నటిదాకా వెంటిలేటర్ పై ఉంది. ఇప్పటికీ ఆ జట్టు ఇన్సెంటివ్ కేర్ యూనిట్ లోనే ఉంది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారు తమ ఆట తీరు ద్వారా అసలు కథను ఇప్పుడే మొదలుపెట్టారు. బెంగళూరు జట్టు అద్భుతమైన విజయాలు అందుకోవాలంటే బౌలర్లు ఇలాంటి ప్రదర్శన చేయాలి. ఐపీఎల్ లో ప్రస్తుతం రెండవ సెషన్ నడుస్తోంది. ఈ సెషన్ లో బెంగళూరు మంచి మార్గంలో నడుస్తోంది.. ఇప్పటికే గుజరాత్ జట్టు తన వైఫల్యమైన ఆటతీరుతో టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి తెచ్చుకుంది. అటు గుజరాత్, ఇటు బెంగళూరులో ఎవరు ప్లే ఆఫ్ చేరుకుంటారనేది చెప్పలేమని” అజయ్ జడేజా అన్నాడు. ఈ సీజన్లో చెరో ఎనిమిది పాయింట్లతో గుజరాత్ , బెంగుళూరు సమానంగా ఉన్నాయి.. నెట్ రన్ రేట్ బాగుండడంతో బెంగళూరు ఏడో స్థానంలో ఉంది. గుజరాత్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.