Virat Kohli : చిరుత పులి జింకను వేటాడినట్టు.. సింహం దుప్పిని దొరకబుచ్చుకున్నట్టు.. ఏనుగు వెలగపండులో గుజ్జును పీల్చినట్టు.. చీతా ఒక్క వేటుతో మనుబోతును చంపేసినట్టు.. సాగుతోంది విరాట్ కోహ్లీ బ్యాటింగ్. ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ విభాగంలో మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ టీమ్ ఇండియా రన్ మిషన్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. బౌలర్ల మీద ఏదో పంచాయితీ ఉన్నట్టు.. బంతిమీద సుదీర్ఘకాలం కోపం ఉన్నట్టు.. కసికొద్దీ కొడుతున్నాడు. బలాన్ని మొత్తం కూడ తీసుకొని బ్యాట్ తో శివాలెత్తిపోతున్నాడు. శనివారం రాత్రి గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడాడు. తన బ్యాటింగ్ పరాక్రమం ఎలా ఉంటుందో గుజరాత్ బౌలర్లకు రుచి చూపించాడు. కేవలం 27 బాల్స్ లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. త్రుటిలో అర్థ సెంచరీ కోల్పోయినప్పటికీ.. అప్పటికే చేయాల్సిన నష్టం చేసి వెళ్లిపోయాడు.
వాస్తవానికి ఈ సీజన్లో విరాట్ కోహ్లీ తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. వీర కొట్టుడు, దంచి కొట్టుడు, నాటు కొట్టుడు, నీటు కొట్టుడు అనే స్టైల్లో బ్యాటింగ్ చేస్తున్నాడు.. ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ విభాగంలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడి 542 రన్స్ చేశాడు. ఇందులో అతడి హైయెస్ట్ స్కోరు 113* . స్ట్రైక్ రేట్ 148.09. ఈ స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ చరిత్రలో 4,000 రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. శనివారం రాత్రి గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 42 రన్స్ చేసి 4000 పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత లిఖించాడు. 4039 రన్స్ తో కోహ్లీ టాప్ లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ 3,945, రోహిత్ శర్మ 3,918, డేవిడ్ వార్నర్ 3,710, సురేష్ రైనా 3,559 రన్స్ తో తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు. కోహ్లీ ఈ రికార్డును మాత్రమే కాదు, టీ 20 ల్లో 12,500 రన్స్ మార్క్ అందుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.