Asia Cup 2025: ప్రపంచంలో అన్ని క్రికెట్ జట్లది ఒక పరిస్థితి అయితే.. భారత జట్టుది మరొక పరిస్థితి. ఇప్పటికిప్పుడు అన్ని ఫార్మాట్లకు వేరువేరు జట్లను ఏర్పాటు చేయాల్సివస్తే.. భారత్ వద్ద బలమైన సమాధానం ఉందని ఇటీవల ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటి పనేసర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అతడు చేసిన వ్యాఖ్యలకు తగ్గట్టుగానే టీమ్ ఇండియా ఉంది. యువ ఆటగాళ్లు, సీనియర్ ఆటగాళ్లతో తులతూగుతూ ఉంది. అందరూ ఫామ్ లోనే ఉన్నారు. ఎవరిని దూరం పెట్టినా ఇబ్బందే. ఇటీవల ఆసియా కప్ కు భారత జట్టును ప్రకటించినప్పుడు అందులో సిరాజ్, యశస్వి జైస్వాల్ కు చోటు లభించలేదు. ఇంగ్లాండ్ సిరీస్లో సిరాజ్, జైస్వాల్ అదరగొట్టారు. వారిని పక్కన పెట్టడం పట్ల మేనేజ్మెంట్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమస్య పరిష్కారమైందనుకుంటే.. ఇప్పుడు మరో సమస్య మేనేజ్మెంట్ కు ఎదురయింది.
ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్ లో సంజు శాంసన్ అదరగొడుతున్నాడు. బీభత్సంగా పరుగులు తీస్తున్నాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా జరిగిన టి20 సిరీస్ లోనూ సంజు ఓ రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ కూడా దుమ్మురేపాడు. సంజు, అభిషేక్ శర్మ ఆసియా కప్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. వన్ డౌన్ లో తిలక్ వర్మ ఆడతాడని తెలుస్తోంది. ఆసియా కప్ కోసం గిల్ ను ఎంపిక చేసిన నేపథ్యంలో అతడిని వన్ డౌన్ లో ఆడిస్తే.. అప్పుడు తిలక్ వర్మ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది.. ఒకవేళ గిల్ ను ఓపెనర్ గా పంపిస్తే సంజు వన్ డౌన్ లో వస్తాడు. అప్పుడు తిలక్ వర్మ రిజర్వ్ బెంచుకు పరిమితం కావాల్సి ఉంటుంది.. గతంలో సంజు వన్ డౌన్ లో ఆడినప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అందువల్ల అతని స్థానాన్ని ప్రభావితం చేయకుండా.. పూర్వపు స్థితిలో ఆడించాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి.
ఐపీఎల్ లో అదరగొట్టినప్పటికీ.. ఇటీవల కాలంలో పొట్టి ఫార్మాట్ లో చెప్పుకునే స్థాయిలో ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.. యూఏఈ వేదికగా ఆసియా కప్ జరుగుతుంది కాబట్టి.. గిల్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. ఒకవేళ వచ్చిన అవకాశాన్ని కనుక అతడు వినియోగించుకుంటే పొట్టి ఫార్మాట్లో అతడికి స్థానం సుస్థిరంగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు మిడిల్ ఆర్డర్లో సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మను ఆడించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. రింకు సింగ్ ఎలాగూ ఉండనే ఉన్నాడు కాబట్టి.. అతడు ఫినిషింగ్ అద్భుతంగా చేస్తాడు. ఇటీవల కాలంలో అతడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు.. కాబట్టి ప్లేయర్ల విషయంలో గంభీర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. సంజు ఫామ్ వల్ల గంభీర్ కు కొత్త తలనొప్పి వచ్చిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.. ఆసియా కప్ లో ప్రయోగాలకు తావు లేకుండా.. దక్షిణాఫ్రికా సిరీస్ మాదిరిగానే ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తాడని తెలుస్తోంది.