Afghanistan Vs Bangladesh: నరాలు కట్ అయిపోయాయి.. ఉత్కంఠ పోరులో బంగ్లాపై ఆప్ఘన్ గెలుపు

వెస్టిండీస్ లోని సెయింట్ విన్సెంట్ వేదికగా సూపర్ -8 మ్యాచ్లో భాగంగా మంగళవారం ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడింది. టాస్ గెలిచిన ఆఫ్ఘానిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 25, 2024 11:13 am

Afghanistan Vs Bangladesh

Follow us on

Afghanistan Vs Bangladesh: అనుక్షణం ఉత్కంఠ.. బంతి బంతికి మారుతున్న విజయ సమీకరణం.. నరాలు తెగే ఒత్తిడి.. ఇన్నింటి మధ్య ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. డక్వర్త్ లూయిస్ మెథడ్ లో పరుగులను కుదించినప్పటికీ అద్భుతమైన ఆటతీరుతో గెలుపును దక్కించుకుంది. 8 పరుగుల తేడాతో సగర్వంగా విజయం సాధించింది.

వెస్టిండీస్ లోని సెయింట్ విన్సెంట్ వేదికగా సూపర్ -8 మ్యాచ్లో భాగంగా మంగళవారం ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడింది. టాస్ గెలిచిన ఆఫ్ఘానిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లలో గుర్బాజ్ 43 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ 19, ఇబ్రహీం జద్రాన్ 18 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సెన్ (3/26) మూడు వికెట్లు పడగొట్టాడు. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ పూర్తయిన తర్వాత వర్షం కురవడం, మైదానం చిత్తడిగా మారడంతో.. అంపైర్లు డక్ వర్త్ లూయిస్ మెథడ్ ను అమలు చేశారు. దీని ప్రకారం ఓవర్లను 19కు కుదించి.. బంగ్లా విజయ లక్ష్యాన్ని 114 పరుగులుగా నిర్ణయించారు..

ఇక 114 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టుకు ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని ఇవ్వలేదు. మరోవైపు మైదానంపై తేమ విపరీతంగా ఉండడంతో ఆఫ్గానిస్థాన్ బౌలర్లు పండగ చేసుకున్నారు. ముఖ్యంగా నవీన్ ఉల్ హక్ పదునైన బంతులు వేస్తూ బంగ్లా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.. ఓపెనర్ శాంటో(ఐదు బంతుల్లో 5 పరుగులు) ను అద్భుతమైన బంతి ద్వారా వెనక్కి పంపించాడు. ప్రమాదకరమైన ఆటగాడు షకీబ్ అల్ హసన్(0) ను కాట్ అండ్ బౌల్డ్ గా అవుట్ చేశాడు.. సౌమ్య సర్కార్ (పది బంతుల్లో; 10 పరుగులు), తౌహిద్ హృదయ్(9 బంతుల్లో 14) కాసేపు ప్రతిఘటించినప్పటికీ.. వీరిని రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. మరో ఆటగాడు మహమ్మదుల్లా (6) కూడా రషీద్ ఖాన్ చేతిలో బాలయ్యాడు. రిషద్ హొస్సెన్(0) ను రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. హసన్ సాకీబ్ ను గుల్బా దిన్ అవుట్ చేయగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ ను నవీన్ ఉల్ హక్ పెవిలియన్ పంపించాడు.

కీలక ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నప్పటికీ.. ఓపెనర్ లిటన్ దాస్ (49 బంతుల్లో 54; ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) తో మాత్రమే నిలబడ్డాడు. చివరి వరకు మైదానంలోనే ఉన్నాడు. అతడికి తోడుగా మరొక ఆటగాడు నిలబడకపోవడంతో ఒంటరి పోరాటం చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు పదునైన బంతులు వేస్తున్నప్పటికీ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. కానీ చివర్లో నవీన్ ఉల్ హక్ మాయాజాలం చేయడంతో దాస్ అర్థ శతకం వృధా అయ్యింది. తస్కిన్ అహ్మద్, రెహమాన్ వికెట్లను వరుస బంతుల్లో పడగొట్టడంతో.. ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. ఈ విజయం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ చేరుకుంది. గ్రూప్-1 లో భారత్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ జట్టు సౌత్ఆఫ్రికా తో సెమీ ఫైనల్ లో తలపడుతుంది.