America: ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్‌ సంబరాలు.. గోల్డెన్‌ జూబ్లీ వేడుకల ఆవిష్కరణ

గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలకు సంబంధించిన లోగోను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగువారు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కృష్ణ లాం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.

Written By: Raj Shekar, Updated On : June 26, 2024 1:24 pm

America

Follow us on

America: అమెరికాలో తెలుగు భాష, సంస్కృతిక పరిరక్షణే గ్రేటర్‌ వాషింగ్‌టన్‌ డీసీ తెలుగు కల్చరల్‌ సంఘం(జీడబ్ల్యూటీసీఎస్‌) లక్ష్యమని సంస్థ అధ్యక్షుడు కృష్ణ లాం అన్నారు. జీడబ్ల్యూటీసీఎస్‌ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమెరికా రాజధాని వాషింగ్‌టన్‌ డీసీలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలకు సంబంధించిన లోగోను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగువారు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కృష్ణ లాం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఐదు దశాబ్దాల క్రితం తెలుగు భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలను పరిరక్షించుకునేందుకు ఏర్పడిన తొలి సంస్థ జీడబ్ల్యూటీసీఎస్‌ అని తెలిపారు. తన భాష, సంస్కృతిని విస్మరించిన ఏ జాతి మనుగడ సాగించలేదన్నారు. ఈ 50 వసంతాల వేడుకల్లో కుల, మత, ప్రాంతాలకతీతంగా అమెరికాలో ఉన్న ప్రతీ తెలుగువారు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.

భారీగా విరాళాలు..
జీడబ్ల్యూటీసీఎస్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు భారీ స్పందన లభించింది. ఈ ఉత్సవాల నిర్వహణకు ఇప్పటికే రూ.5 కోట్ల విరాళాలు ప్రకటించారు. వేడుకల్లో తానా మాజీ అధ్యక్షుడు సతీశ్‌ వేమన మాట్లాడుతూ ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో జీడబ్ల్యూటీసీఎస్‌ ఆధ్వర్యంలో కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య, వైద్యానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసించారు. అనంతరం తానా ప్రస్తుత అధ్యక్షుడు నరేన్‌ కొడాలి మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో సంస్కృతి, సంప్రదాయాలు మారుతున్నా మనం మాత్రం జీడబ్ల్యూటీసీఎస్‌ ద్వారా పండుగలు, సంప్రదాయాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని, వైభవ ప్రాభవాలను భావితరాలకు అందించే బాధ్యత ఈ తరంపై ఉందని గంగాధర్‌ నాదెండ్ల గుర్తు చేశారు.

ఒకే గొడుకు కిందకు తెలుగువారు..
రవి పొట్లూరు మాట్లాడుతూ అమెరికాలో ఉన్న తెలుగువారందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు, తెలుగు జాతికి గుర్తింపు, గౌవాన్ని జీడబ్ల్యూటీసీఎస్‌ తీసుకువచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్నవ సుబ్బారావు, సాయిసుధ, పాడుగు సత్యనారాయణ మన్నె, అనిల్‌ ఉప్పలపాటి, సాయి బొల్లినేని తదితరులు మాట్లాడారు. జీడబ్ల్యూటీసీఎస్‌ గొప్పదనాన్ని, అందిస్తున్న సేవలను ప్రశంసించారు.