Nitish Kumar Reddy: నితీష్ రెడ్డి.. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ గెలిచిన తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. మీడియా నుంచి, సోషల్ మీడియా వరకు నితీష్ రెడ్డి ఫీవర్ తో ఊగిపోతుంది.. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాళ్లు అతడి పేరును స్మరిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఒకే ఒక ఇన్నింగ్స్ తో అతడు ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. నితీష్ రెడ్డి కీలక ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.. ఆ వీడియోలో హైదరాబాద్ ఆటగాడు నితీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి.. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో నితీష్ కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడాడు. ” నన్ను గత ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో నాకు ఆడే అవకాశం అంతంత మాత్రమే లభించింది. మొదట్లో నన్ను అందరు బౌలర్ గానే గుర్తించేవారు. నాకేమో ఆల్ రౌండర్ అవ్వాలని ఉండేది. నన్ను నేను నిరూపించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అందుకోసమే ఈ సీజన్ లో బ్యాటింగ్ పై కూడా దృష్టి సారించాను. మెరుగైన ఇన్నింగ్స్ ఆడాలనుకుంటున్నాను. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నానని” నితీష్ రెడ్డి తన మనసులో మాట బయటపెట్టాడు. ఆ వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేసింది. మంగళవారం పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో నితీష్ రెడ్డి కీలక ఇన్నింగ్స్ ఆడి.. హైదరాబాద్ జట్టును గెలిపించిన నేపథ్యంలో.. ఆ వీడియో ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం హైదరాబాద్ ఆటగాళ్లు స్టేడియం నుంచి ప్రత్యేకమైన బస్సులో తాము బస చేసిన హోటల్ లోకి వచ్చారు. హోటల్ నిర్వాహకులు ఒక ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేశారు. కీలక ఇన్నింగ్స్ ఆడి హైదరాబాద్ జట్టును గెలిపించిన నితీష్ రెడ్డి తో కేక్ కట్ చేయించారు. కేక్ కట్ చేసిన అనంతరం.. హైదరాబాద్ ఆటగాళ్లు అతడి ముఖం మీద కేక్ పూశారు. కేరింతలు కొట్టారు. ఈ వీడియోను కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా జట్టు ఆటగాళ్ల కోసం హోటల్ యాజమాన్యం ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేసింది. విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్ ఆటగాళ్లు ఆ విందును ఆస్వాదిస్తూ చిల్ అయ్యారు.
ఇక అంతకుముందు నితీష్ రెడ్డి ఉగాది పర్వదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశాడు. “హాయ్.. అందరికీ నమస్కారం. తెలుగు వారందరికీ హృదయపూర్వక ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ పండుగ మీ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు.. మీరు ఇలాగే హైదరాబాద్ జట్టుపై ప్రేమను కురిపించాలని కోరుకుంటున్నాను” అంటూ నితీష్ రెడ్డి వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఆ వీడియోను కూడా హైదరాబాద్ జట్టు గెలిచిన తర్వాత సన్ రైజర్స్ యాజమాన్యం తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేసింది. పంజాబ్ జట్టు పై ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నితీష్ రెడ్డి పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ట్విట్టర్ ఎక్స్ లో అతని పేరు ట్రెండింగ్ లో ఉంది.