T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్ 1 న భారత్ బంగ్లాదేశ్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడుతుంది. గత కొద్ది రోజుల క్రితమే రోహిత్ ఆధ్వర్యంలో అమెరికాలో దిగిన టీమిండియా బృందం నెట్స్ లో సాధన చేస్తోంది. అమెరికా లోని మైదానాలకు అలవాటు పడేందుకు చెమటోడ్చుతోంది.. 2007లో టి20 వరల్డ్ కప్ ప్రారంభమైన సంవత్సరంలో ధోని ఆధ్వర్యంలోని టీమిండియా విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ పై సంచలన విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా టీమిండియా మరోసారి టి20 వరల్డ్ కప్ నెగ్గలేకపోయింది. కెప్టెన్ గా తన కెరీర్లో చివరి t20 వరల్డ్ కప్ ఆడుతున్నాడు రోహిత్ శర్మ.. ఈ క్రమంలో తన ఆధ్వర్యంలో టీమిండియా కు వరల్డ్ కప్ అందించాలని భావిస్తున్నాడు. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో అప్పటినుంచి రోహిత్ శర్మ మనసులో ఏదో వెలితిగా ఉంది.. అయితే ఈసారి దానిని టి20 వరల్డ్ కప్ ద్వారా భర్తీ చేయాలని అతడు భావిస్తున్నాడు..కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కు కూడా టి20 వరల్డ్ కప్ చివరి టోర్నీ. హెడ్ కోచ్ గా తన పదవి విరమణ ముందు..టీ -20 వరల్డ్ కప్ టీమిండియా సాధిస్తే.. విజయవంతంగా వీడ్కోలు పలకవచ్చనేది ఆయన యోచన. అయితే ఈ కలను సాకారం చేసుకునేందుకు తమ వద్ద మెరుగైన ప్రణాళికలు ఉన్నాయని చెబుతున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.
టి20 వరల్డ్ కప్ ప్రయాణాన్ని టీమిండియా శనివారం నుంచి మొదలు పెట్టనుంది. బంగ్లాదేశ్ జట్టుతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. టోర్నీ ప్రారంభానికి ముందు అక్కడి వాతావరణం, మైదాన పరిస్థితులకు టీమిండియా ఆటగాళ్లు అలవాటు పడాల్సి ఉంది. అందుకే వారు ప్రాక్టీస్ మ్యాచ్ ను చాలా కీలకంగా పరిగణిస్తున్నారు. బ్యాటర్లు, బౌలర్లు తమ ఫామ్ అందిపుచ్చుకునేందుకు ఉపకరిస్తుందని భావిస్తున్నారు. జూన్ ఆగిన టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. దానికి సన్నాహకంగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ ను ఉపయోగించుకోనుంది.. అయితే టీమ్ ఇండియా ఆటగాళ్లు నెట్స్ లో తీవ్రంగా సాధన చేస్తున్నారు. సాధన పూర్తయిన తర్వాత న్యూయార్క్ అందాలను ఆస్వాదిస్తున్నారు.. ప్రాక్టీస్ అనంతరం వేదిక చాలా బాగుందని కితాబిస్తున్నారు.. ఓపెన్ గ్రౌండ్ లాంటి మైదానంలో ఆడేందుకు ఆత్రంగా ఉందని వారు చెబుతున్నారు. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ శనివారం జరుగుతున్న నేపథ్యంలో.. ఈ మ్యాచ్ చూసేందుకు భారీగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.
15 మందితో టి20 వరల్డ్ కప్ కోసం టీమిండియాను బీసీసీఐ ఎంపిక చేసింది. పేస్ బౌలర్లతోపాటు, బ్యాటర్లను సమానంగా ఎంపిక చేసింది. వీరిలో రోహిత్ శర్మ నుంచి మొదలు పెడితే శివం దూబే వరకు అందరూ ఫామ్ లో ఉన్నారు. అయితే జట్టకు కీలక సమయంలో ఆటగాళ్లు చేతులెత్తేయడం భారత జట్టుకు ఇటీవల పరిపాటిగా మారింది.. వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ అపవాదును చెరిపి వేసుకోవాలంటే.. టీమ్ ఇండియా ధైర్యంగా ఆడాల్సి ఉంది. ఒక్కరి మీద ఆధారపడకుండా సమష్టి ప్రదర్శన చేయాల్సి ఉంది. టి20 ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం టీమిండియా మొదటి స్థానంలో ఉంది. ఆ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలంటే ఆటగాళ్లు అంతకుమించి అనేలాగా ప్రదర్శన చేయాల్సి ఉంది.. వెస్టిండీస్, అమెరికా మైదానాలు అటు పేస్, ఇటు స్పిన్ కు సహకరిస్తాయి.. అలాంటప్పుడు బ్యాటర్లు అన్ని పరిస్థితులకు అనుగుణంగా తమ బ్యాటింగ్ మార్చుకోవాల్సి ఉంది. ఇక భారత్, బంగ్లాదేశ్ ప్రాక్టీస్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లోనూ ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.