Para Olampics 2024: మొదలైన పారా ఒలింపిక్స్..రాణిస్తున్న భారత క్రీడాకారులు.. ఆర్చరీ శీతల్ వరల్డ్ రికార్డు..వివరాలేంటో చూద్దాం..

ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు భారత క్రీడాకారులు అదరగొట్టారు.. ఇక ఆర్చర్ శీతల్ దేవి ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకుంది.

Written By: Mahi, Updated On : August 30, 2024 4:23 pm

Para Olampics 2024

Follow us on

Para Olampics 2024: పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్ మొదలయ్యాయి. 12 రోజుల పాటు వివిధ క్రీడా విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. మొత్తంగా 549 పతకాల కోసం 4400 మంది పారా అథ్లెట్లు ఈ పోటీలకు హాజరయ్యారు. ఇక భారత్ 84 మంది అథ్లెట్లతో బరిలోకి దిగింది. 2020లో టోక్యోలో నిర్వహించిన పారా ఒలింపిక్స్ లో భారత్ 5 స్వర్ణాలు సహా 19 పతకాలు గెలుచుకుంది. ఈసారి కూడా అంతకుమించి పతకాలు సాధించాలని రంగంలోకి దిగింది. ఇక ప్రారంభ వేడుకల్లో షాట్ ఫుటర్ భాగ్యశ్రీ జాదవ్ , జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ భారత పతకధారులుగా పాల్గొన్నారు. గత ఒలింపిక్స్ లో వీరిద్దరూ స్వర్ణాలు గెల్చుకున్నారు. ఇక ఈసారి పతకాలు గెలిచే వారిలో తెలంగాణకు చెందిన అథ్లెట్ జివాంజీ దీప్తి ఉన్నారు. ఇక ఈసారి భారత్ కు పతకాలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒలింపిక్స్ మొదటి రోజు భారత్ శుభారంభం చేసింది. ఆర్చరీ శీతల్ దేవి పతకం వైపు దూసుకెళ్తున్నది.

భారత్ ఖాతాలో తొలిపతకం శీతల్ దేవినే అందించేలా కనిపిస్తున్నది. పారా ఒలింపిక్స్ లో భారత్ ఆర్చర్ శీతల్ దేవితో పాటు షట్లర్లు సుకాంత్, సుహాస్, తరుణ్ రాణించారు. చేతులు లేకపోయినా కాళ్లతో గురిపెట్టిన శీతల్ లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో ప్రపంచ రికార్డు ఆమె సొంతమైంది. ఇప్పటికే ప్రీ క్వార్టర్ చేరుకున్న శీతల్, పతకం గెలవడం ఖాయంగా కనిపిస్తున్నది. కాలుతు విల్లును పట్టి భుజంతో బాణాలు విసరడంలో శీతల్ దిట్ట. ఇక పారా ఒలింపిక్స్ తొలి రోజు అద్భుతమే చేసింది. తనదైన ప్రదర్శనతో రాణించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకుంది. శీతల్ ప్రదర్శన అద్భుతమని భారత పారా టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది.

భారత్ ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి పారా ఒలింపిక్స్ లో అదరగొట్టింది. మహిళల వ్యక్తిగత విభాగంలో శీతల్ దేవి రెండో స్థానంలో నిలిచి ప్రీ క్వార్టర్స్ కు చేరింది. ఇక 16 వ రౌండ్ లోకి నేరుగా ప్రవేశించి పతక ఆశలను సజీవంగా ఉంచింది. ఉత్తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. పారిస్ మీడియా శీతల్ ప్రదర్శనపై ప్రత్యేక కథనాలు వెలువరించింది. మొత్తంగా 720 పాయింట్లకు గాను 703 పాయింట్లు సాధించి ఔరా అనిపించింది. ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. మరోవైపు షట్లర్లు సుహాస్, సుకాంత్ ,తరుణ్ కూడా రాణించారు. తొలి రౌండ్ లో విజయం సాధించారు. సింగిల్స్ లో వీరు తమకు సాటెవరూ లేరంటూ విజయం సాధించారు. ఇక తరుణ్ బ్రెజిల్ కు చెందిన జేవియర్ పై 21-17, 21-19 తో విజయం సాధించాడు. గ్రూప్ ఏలో 21-7,21-5తో ఇండోనేషియాకు చెందిన హిక్మత్ పై సుహాస్ గెలుపాందాడు. సుకాంత్ మలేషియాకు చెందిన అమీన్ పై 17-21,21-15,22-20తో విజయ ఢంకా మోగించాడు.

ఇక భారత అథ్లెట్ల నేటి షెడ్యూల్
షూటింగ్- మహిళల 10 మీటర్ల విభాగంలో ఎయిర్1 పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్ (మధ్యాహ్నం 12.30 , ఫైనల్ మధ్యాహ్నం 3.15 గంటలు)
పురుషుల 10 మీటర్ల విభాగంలో ఎయిర్ పిస్టల్ ఎన్ హెచ్ 1 విభాగంలో రుద్రాన్ష్, మనీశ్ (మధ్యాహ్నం 02.45 గంటలు , ఫైనల్ మధ్యాహ్నం 5.30 గంటలు)
మిక్స్ డ్ విభాగంలో10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్టాండింగ్ ఎస్ హెచ్ 2 క్వాలిఫికేషన్ విభాగంలో శ్రీహర్ష పాల్గొననున్నాడు. ( సాయంత్రం 5గంటలు, ఫైనల్ రాత్రి 7.45 గంటలు)