Look back sports:ఈ ఏడాది భారత్ t20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నీలో భారత్ ఘనవిజయం సాధించింది. రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. అత్యంత ఉత్కంఠ పరిస్థితుల మధ్య పొట్టి ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారత్ మొత్తం 13 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను 4-1 తేడాతో గెలుచుకుంది. అనంతరం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో గెలిచింది. అక్టోబర్, నవంబర్ మధ్యకాలంలో స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను కోల్పోయింది. 0-3 తేడాతో భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. దీంతో భారత జట్టుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఆశలు కష్టతరంగా మారాయి. ఇక టీమిండియా ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో పెర్త్ లో జరిగిన మ్యాచ్ లో 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. అడిలైడ్ లో జరిగిన పింక్ బాల్ టెస్టులో పదవికి ఎట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఏడాది భారత్ ఇంకా రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఐదో మ్యాచ్ 2025 జనవరిలో జరగనుంది..
2007 తర్వాత..
వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ టి20 వరల్డ్ కప్ కు ఉంటుంది. ఈ వరల్డ్ కప్ ను భారత్ 17 సంవత్సరాల తర్వాత గెలుచుకుంది. జూన్ 29న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి టి20 వరల్డ్ కప్ ను సగర్వంగా సాధించింది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నారు.. టి20 నుంచి నిష్క్రమిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సిరీస్ మాత్రమే కాకుండా భారత్ ఈ సంవత్సరం మొత్తం 18 t20 మ్యాచ్ లు ఆడింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై మూడు మ్యాచ్ ల సిరీస్ ను 3-0 తో గెలుచుకుంది. జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల సిరీస్ ను 4-1 తో దక్కించుకుంది. శ్రీలంకతో మూడు టి20 మ్యాచ్ల సిరీస్ ను 3-0 తేడాతో దక్కించుకుంది. బంగ్లాదేశ్ తో మూడు టి20 మ్యాచ్ల సిరీస్ ను 3-0 తేడాతో వశం చేసుకుంది. దక్షిణాఫ్రికా తో నాలుగు టి20 మ్యాచ్ల సిరీస్ ను 4-1 తేడాతో గెలిచింది. మొత్తంగా 18 t20 మ్యాచ్ లు ఆడిన టీమిండియా.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే చేతిలో ఒక్కో మ్యాచ్ చొప్పున ఓడిపోయింది. ఏకంగా 16 మ్యాచ్లలో గెలిచింది.
అన్ని ఫార్మాట్లలో..
ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ తన సత్తాను ప్రదర్శించింది. టి20, టెస్టులలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో అడిలైడ్ టెస్ట్ లో ఓడిపోవడంతో మూడో స్థానంలోకి పడిపోయింది. వన్డే, టీ 20 ఫార్మాట్ లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో రోహిత్, గిల్, విరాట్ కోహ్లీ టాప్ -5 లో కొనసాగుతున్నారు. టి20 క్రికెటర్లలో ఆల్ రౌండర్ కేటగిరీలో హార్దిక్ పాండ్యా మొదటి స్థానంలో ఉన్నాడు. టెస్ట్ ర్యాంకింగ్స్ లో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ తమ కెరియర్ లోనే అత్యుత్తమ స్థానాలలో ఉన్నారు.
ద్రావిడ్ వెళ్లిపోయాడు.. గంభీర్ వచ్చాడు
టి20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రాహుల్ ద్రావిడ్ తన కోచ్ పదవి నుంచి నిష్క్రమించాడు. ఆయన పదవీకాలం ముగిసిపోవడంతో అతడి స్థానంలో గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించాడు. మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్ గా నియమితుడయ్యాడు.. ర్యాన్ డోస్చేట్, అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్ లు గా నియమితులయ్యారు.
ఆడింది ఒకే సిరీస్.. అందులోనూ ఓటమి
అదే భారత్ ఈ ఏడాది ఒకే ఒక వన్డే సిరీస్ ఆడింది. అందులో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. శ్రీలంక జట్టుతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడింది. శ్రీలంక 2-0 తేడాతో ట్రోఫీ సొంతం చేసుకుంది. తొలి వన్డే డ్రా అయింది. రెండో వన్డే 32, మూడో వన్డే 110 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది.