Manchu Manoj press meet : గత రెండు రోజులుగా మీడియా లో ఎక్కడ చూసిన మంచు కుటుంబం గురించే చర్చ. ఆస్తుల వివాదం లో మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య అర్థరాత్రి సమయంలో జరిగిన ఘర్షణ, ఆ తర్వాత జరిగిన పరిణామాలను మనమంతా చూస్తూనే ఉన్నాం. మంచు మనోజ్ దౌర్జన్యంగా మోహన్ బాబు ఇంటి గేట్లను బద్దలు కొట్టుకొని లోపలకు వెళ్లడం వంటివి చూసాం మనం. ఈ ఘటన జరుగుతున్నా సమయంలో, అక్కడ లైవ్ కవరేజి ఇవ్వడానికి వచ్చిన మీడియా రిపోర్టర్ పై మోహన్ బాబు చెయ్యి చేసుకోవడం, బూతులు తిట్టడం వంటివి సంచలనం గా మారాయి. ఈరోజు ఉదయం మంచు మనోజ్ మీడియా తో మాట్లాడుతూ నేడు సాయంత్రం ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేస్తానని, అసలు గొడవ ఎక్కడి నుండి మొదలైంది, ఎవరి మొదలైంది, ఎవరు తప్పు చేస్తున్నారు అనేది ఆధారాలతో సహా బయటపెడుతాను అని మనోజ్ చెప్పుకొచ్చాడు.
ఈ ప్రెస్ మీట్ జరిగిన కాసేపటికి మంచు విష్ణు ప్రెస్ మీట్ కూడా జరిగింది. మీడియా ఆయన్ని గొడవ కి కారణాలు అడగ్గా, ఇది మా కుటుంబ వ్యవహారం, ప్రతీ ఇంట్లో ఉండేదే, దానిని నేను బయట చెప్పాలని అనుకోవడం లేదు అని అంటాడు. ఎలాగో సాయంత్రం ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి మనోజ్ జరిగిన విషయాలను మొత్తం బయటపెడుతాడు కదా, విష్ణు మాటలతో పని ఏముందిలే అని మీడియా రిపోర్టర్స్ అనుకున్నారు. సాయంత్రం న్యూస్ చానెల్స్ కి మంచి స్టఫ్ దొరుకుతుందని ఆశించారు. కానీ వారి ఆశలపై మనోజ్ నీళ్లు చల్లాడు. ఏమి జరిగిందో ఏమో కారణం తెలియదు కానీ, ఆయన ప్రెస్ మీట్ ని రద్దు చేసుకున్నాడు. మనోజ్ ఎందుకు ప్రెస్ మీట్ రద్దు చేసుకున్నాడు అనేదే ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసిన అంశం. అంటే గొడవ సర్దుమణిగిందా?, కుటుంబం మొత్తం ఏకమయ్యిందా ?, మళ్ళీ కలిసిపోయారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అంతే కాకుండా ఇంట్లో విషయాలను బయటపెట్టి కుటుంబ గౌరవ మర్యాదలను నాశనం చెయ్యకు అని మనోజ్ ని అతని తల్లి ఫోన్ చేసి బ్రతిమిలాడుకోవడం వల్లనే మనోజ్ తన ప్రెస్ మీట్ ని రద్దు చేసుకున్నాడనే వార్త కూడా సోషల్ మీడియా లో ప్రచారంలో ఉంది. ఇవి రెండు కాకుండా స్వయంగా మోహన్ బాబే మంచు మనోజ్ ని పిలిచి ఆయన అడిగిన ఆస్తుల్లో వాటాలు ఇస్తాను అని చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిల్లో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియదు కానీ, మనోజ్ ప్రెస్ మీట్ ని రద్దు చేసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందని సమాచారం. మరోపక్క మోహన్ బాబు నిన్న మీడియా రిపోర్టర్స్ తో జరిగిన గొడవలో స్వల్పంగా గాయాలు పాలవ్వడంతో ఆయన్ని హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ కి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు. ఇంకా ఆయన హాస్పిటల్ లోనే ఉన్నట్టు సమాచారం.