Satyanarayana Swamy Vratham: హిందూ శాస్త్రం ప్రకారం పూజలు, వ్రతాలు చేయడం వల్ల జీవితం సంతోషమయంగా మారుతుందని భావిస్తారు. అందుకే పర్వదినాల్లో ప్రత్యేకంగా కొన్ని వ్రతాలు చేస్తుంటారు. వీటిలో సత్యనారాయణ వ్రతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. శ్రీ మహావిష్ణువును సత్యరూపిడిగా ఆరాధిస్తూ చేసే ప్రత్యేక పూజలనే సత్యనారాయణ వ్రతమని అంటారు. సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల ఒక కుటుంబంలో ఐశ్వర్యం, ఆనందం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. సత్యనారాయణ వ్రతంలో శుభదినాల్లో ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు. కానీ ప్రతి ఏడాదిలో వచ్చే కార్తీకమాసంలోనే సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తుంటారు. అసలు ఈ వ్రతం చేయడానికి కారణాలు ఏంటి? ఈ వ్రతం చేయడానికి ఉన్న నియమాలు ఏంటి? ఈ వ్రతం ఎలా మొదలైంది?
పురాణ కథల ప్రకారం నారదుడు భూలోకంలో ప్రజలు పడే కష్టసుఖాలను తెలిసి వారిని సన్మార్గంలో పయనించేలా చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం శ్రీమహావిష్ణువును ఆశ్రయించాడు. ప్రజల కష్ట సుఖాలను తొలగించాలని వేడుకున్నాడు. దీంతో శ్రీమహావిష్ణువు తనను సత్యదేవుడిగా భావించి పూజలు చేస్తే కష్టసుఖాలు తొలగిపోతాయని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్పడంతో అప్పటినుంచి సత్యనారాయణ వ్రతాలు ప్రారంభమైనట్లు పురాణ కథల్లో చెప్పబడింది. అయితే సత్యనారాయణ వ్రతం నిర్వహించే సమయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
ఏ రోజు అయితే సత్యనారాయణ వ్రతం నిర్వహించాలని అనుకుంటున్నారో.. ఆరోజు సూర్యోదయానికి ముందే కుటుంబ సభ్యులంతా స్నానమాచరించాలి. అంతకుముందు ఇంటిని శుభ్రంగా ఉంచాలి. పూజా స్థలం ఉత్తర వైపుగా ఎదురుగా కూర్చోవాలి. పూజలో రాగి లేదా వెండి పాత్ర పాత్రతో కలశం పెట్టి దానిపై తులసి లేదా కొబ్బరికాయ ఉంచాలి. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించి దీపం వెలిగించాలి. పంచామృతాభిషేకం చేసి పూజ పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత సత్యనారాయణ కథ పారాయణం చేయాలి. ఇది ఐదు అధ్యాయాలతో కూడి ఉంటుంది. వ్రత కథలు పూర్తి కాగానే ప్రార్థన చేయాల్సి ఉంటుంది.
సత్యనారాయణ వ్రతం ఎవరైతే నిర్వహించుకుంటున్నారో వారి ఇంట్లో ఆరోజు సాత్విక ఆహారం మాత్రమే ఉండాలి. కుటుంబ సభ్యుల్లో దంపతులు ఉపవాసం ఉంటూ అల్పాహారం మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయాలి. సత్యనారాయణ వ్రతం పూజ చేసే సమయం మధ్యలో ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఉండాలి. అలాగే కొన్ని పనులను ఎగతాళి చేయకూడదు. పూజ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులు అంతా కలిసి భోజనం చేయాలి.
సత్యనారాయణ వ్రతం చేయడం మాత్రమే కాకుండా ఈ వ్రత కథను విన్నా కూడా శుభప్రదమే అని అంటారు. వ్రత కథ వినడం వల్ల ఆరోగ్యంతో పాటు శాంతి, ధనాభివృద్ధి లభిస్తుందని చెబుతారు. అలాగే సత్యనారాయణ వ్రతం నిర్వహించుకునే సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను ఇంటికి ఆహ్వానించాలి. సాధారణంగా ఏడాదిలో ఎప్పుడైనా మంచి రోజుల్లో సత్యనారాయణ వ్రతం నిర్వహించుకుంటూ ఉంటారు. కానీ కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువును కొలవడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుందని భావిస్తారు. అందుకే ఈ మాసంలో ఎక్కువగా సత్యనారాయణ వ్రతాలు నిర్వహించుకుంటూ ఉంటారు.