https://oktelugu.com/

TTD Chairmen : టీటీడీ అధ్యక్ష పీఠం ఎవరికి.. అశోక్ వైపు మొగ్గు చూపుతారా.. మురళీమోహన్ కు జై కొడతారా?

టీటీడీ అధ్యక్ష నియామకానికి సంబంధించి మరో వారం రోజుల్లో ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది. అశోక్ గజపతిరాజు, మురళీమోహన్లలో ఒక్కరికి పదవి ఖాయమనిసమాచారం. మధ్యలో ఓ టీవీ ఛానల్ అధినేత పేరు వచ్చినా.. ఆయన విషయంలో పార్టీలో అంత సానుకూలత కనిపించడం లేదు. సామాజిక వర్గ పరంగా కూడా ఆయన నియామకం పై అభ్యంతరాలు ఉన్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : July 16, 2024 11:43 am
    Follow us on

    TTD Chairmen : ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. పునీతులవుతారు. అటువంటి ధార్మిక సంస్థకు చైర్మన్ అంటే ఆ పదవికి ఎనలేని క్రేజ్. రాష్ట్ర క్యాబినెట్ మంత్రితో సమానమైన పదవి అది. అందుకే విపరీతమైన పోటీ ఉంటుంది. చైర్మన్ తో పాటు సభ్యుల నియామకానికి పెద్ద ఎత్తున రాజకీయ సిఫారసులు వస్తుంటాయి. ప్రస్తుతం అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. దీంతో హేమా హేమీలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి. అయితే చంద్రబాబు ఎవరికీ చాన్స్ ఇస్తారో చూడాలి.

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. టిటిడి అధ్యక్షుడిగా మెగా బ్రదర్ నాగబాబు పదవి బాధ్యతలు చేపడతారని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఆయన పెద్దగా సానుకూలత చూపలేదని కూడా తెలిసింది. మరోవైపు మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరు బలంగా వినిపించింది. ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్రలో దేవస్థానాలకు ధర్మకర్త హోదాలో ఉన్నారు. పైగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్నారు. అన్నింటికీ మించి గత వైసిపి ప్రభుత్వం అశోక్ గజపతిరాజును టార్గెట్ చేసుకుంది. రకరకాలుగా ఇబ్బంది పెట్టింది. అందుకే అశోక్ గజపతి రాజుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే గౌరవించినట్టు అవుతుందని అందరూ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు సైతం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

    అయితే ఇప్పుడు తాజాగా నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ మురళీమోహన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పని చేస్తున్నారు. ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చారు. వివాదరహితుడిగా కూడా పేరు ఉంది. పైగా సినీ పరిశ్రమలో సీనియర్ యాక్టర్ కూడా ఆయనే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు తరువాత మురళీమోహన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన వయసు 84 ఏళ్లు. ఈ ఎన్నికల్లో మురళీమోహన్ పోటీ చేయలేదు. టీటీడీ అధ్యక్షుడిగా అవకాశం కల్పిస్తే స్వామివారి సేవ చేసుకుంటానని.. మురళీమోహన్ ఇటీవల చంద్రబాబును రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

    టీటీడీ అధ్యక్ష నియామకానికి సంబంధించి మరో వారం రోజుల్లో ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది. అశోక్ గజపతిరాజు, మురళీమోహన్లలో ఒక్కరికి పదవి ఖాయమనిసమాచారం. మధ్యలో ఓ టీవీ ఛానల్ అధినేత పేరు వచ్చినా.. ఆయన విషయంలో పార్టీలో అంత సానుకూలత కనిపించడం లేదు. సామాజిక వర్గ పరంగా కూడా ఆయన నియామకం పై అభ్యంతరాలు ఉన్నాయి. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు ప్రత్యక్ష ఎన్నికల నుంచి దూరమయ్యారు. ఇద్దరికీ మంచి ట్రాక్ రికార్డు ఉంది. అయితే ఎవరికి చంద్రబాబు జై కొడతారో చూడాలి.

    మరోవైపు బిజెపితో పాటు జనసేన నేతలు సైతం టీటీడీ అధ్యక్ష పదవిని కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం కావడంతో నామినేటెడ్ పదవుల్లో సైతం వాటా అడుగుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నుంచి సోము వీర్రాజు, జివిఎల్ నరసింహం, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఈ తరుణంలో టీటీడీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.

    కూటమి ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుంది. అందుకే మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. మూడు పార్టీలు అధ్యక్ష పదవిని పంచుకునే పరిస్థితి కనిపిస్తోంది. కూటమిలో పెద్ద పార్టీగా టిడిపి ఉండడం, టీటీడీ అధ్యక్ష పదవి కీలకము కావడంతో ఆ పార్టీ వదులుకునే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.