Vijayasai Reddy : ప్రేమ సమాజం : విజయసాయిరెడ్డికి ఆ కమిషనర్ శాంతికి లింక్ ఏంటి? అసలు పరిచయానికి దారితీసిన పరిస్థితులేంటి?

విశాఖలో ప్రేమ సమాజానికి వేల కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. వాటిపై విజయ్ సాయి రెడ్డి కన్ను పడింది. ఆ వివరాలు కావాలంటూ దేవాదాయ శాఖను ఆదేశించారు. సహాయ కమిషనర్ హోదాలో శాంతి ఈ విషయంలో సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి ఆదేశాల కంటే వేగంగా పనులు పూర్తి చేసి ఆయన అభినందనలు అందుకున్నట్లు సమాచారం.

Written By: Dharma, Updated On : July 16, 2024 11:50 am
Follow us on

Vijayasai Reddy : వైసీపీలో నెంబర్ 2 గా ఎదిగారు విజయసాయిరెడ్డి. పార్టీ ఆవిర్భావం నుంచి చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ తర్వాత పార్టీలో కనిపించేది ఆయనే. వినిపించేది ఆయన మాటే. అటువంటి విజయసాయి రెడ్డి పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అవి కామన్ కూడా. కానీ తాజా వివాదం మాత్రం మరో ఎత్తు. తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరని ఓ వ్యక్తి ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి పేరును ప్రస్తావించారు. ఇంతటి లేటు వయసులో ఆ తరహా ఆరోపణలు రావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. దీని వెనుక పెద్ద కథ నడిచినట్లు ప్రచారంలో ఉంది. ముఖ్యంగా విశాఖలోని ప్రేమ సమాజం భూముల వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె విజయసాయి రెడ్డికి దగ్గరైనట్లు ప్రచారంలో ఉంది.

విశాఖలో ప్రేమ సమాజానికి వేల కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. వాటిపై విజయ్ సాయి రెడ్డి కన్ను పడింది. ఆ వివరాలు కావాలంటూ దేవాదాయ శాఖను ఆదేశించారు. సహాయ కమిషనర్ హోదాలో శాంతి ఈ విషయంలో సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి ఆదేశాల కంటే వేగంగా పనులు పూర్తి చేసి ఆయన అభినందనలు అందుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా దేవాదాయ శాఖ పరిధిలోని ప్రేమ సమాజానికి చెందిన సాయి ప్రియ రిసార్ట్స్ భూమిని.. యాజమాన్యం నుంచి తప్పించేందుకు విజయసాయిరెడ్డి తో చేతులు కలిపారు అన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. మరోవైపు విజయ్ సాయి వెంట ఉండే ప్రభుత్వం న్యాయవాది సుభాష్ కు దగ్గర అయ్యారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిని కలిపింది మాత్రం ప్రేమ సమాజం భూముల వ్యవహారమేనని తెలుస్తోంది.

అనాధలు, వృద్ధులకు వివిధ రకాల సేవలు అందించేందుకు ప్రేమ సమాజం ట్రస్ట్ ఏర్పడింది. దీనికి ఉత్తరాంధ్రలో పలుచోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. చాలా ఆస్తులు లీజుతో పాటు అద్దెకు కొనసాగుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విలువైన ఆస్తులపై నేతల కన్ను పడింది. 2020 అక్టోబర్లో దేవాదాయ శాఖ ఈ భూములను స్వాధీనం చేసుకుంది. దీంతో ప్రేమ సమాజానికి ఆదాయం పడిపోయింది. ప్రేమ సమాజం నిర్వహణకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఎంతోమంది మహనీయులు ప్రేమ సమాజం ట్రస్ట్ కు విలువైన భూములు అప్పగించారు. విశాఖ డాబా గార్డెన్స్ లోని ప్రేమ సమాజం 1.88 ఎకరాల్లో విస్తరించి ఉంది. చంగల్ రావు పేటలో 2140గజాల్లో లెప్రసీ కేంద్రం, సోల్జర్ పేటలో 380 గజాల స్థలం, ఋషికొండ సర్వేనెంబర్ 16,23, 24 లో 47.33 ఎకరాల భూములు కూడా ఉన్నాయి. అందులో కొంత వరకు లీజుకు ఇచ్చారు. భీమిలి లో ఒక చోట 60 గజాలు, మరోచోట 23 సెంట్లు స్థలం ఉంది. చోడవరంలో 1.29 ఎకరాల్లో శాశ్వత నిర్మాణం, 29 సెంట్లలో భవనం, మరో 4.94 ఎకరాల స్థలం ఉంది. శ్రీకాకుళం జిల్లా గుజరాతి పేటలో 61 సెంట్లు, నరసన్నపేటలో 21 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. విజయనగరం జిల్లా జామి లో 19.48 భూమి ప్రేమ సమాజానికి ఉంది.

అయితే ఈ భూములను ఎలాగైనా కొల్లగొట్టాలన్నది కొందరు వైసీపీ నేతల ప్లాన్ అన్నట్లు ఆరోపణలు వచ్చాయి. విజయసాయి రెడ్డి పై సైతం ఇదే తరహా ఆరోపణలు రావడం విశేషం. తాజాగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మీడియా ముందుకు వచ్చారు. ఆమె భర్త దేవాదాయ శాఖ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదు పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఆరోపణల్లో నిజం లేదని.. ఎంపీ విజయసాయిరెడ్డి తో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. కేవలం శాఖపరమైన సమీక్షకు తాను వెళ్లానని.. అప్పుడే విజయసాయి రెడ్డిని కలిశానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ప్రేమ సమాజం భూముల ప్రస్తావనను తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. విజయసాయి రెడ్డి తో పాటు రెవెన్యూ వ్యవహారాలు చూసే ప్రభుత్వ న్యాయవాది సుభాష్ తో.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని కలిపింది ప్రేమ సమాజమేననిటాక్ వినిపిస్తోంది. దీనిపైనే విస్తృతమైన చర్చ నడుస్తోంది.