Diwali Lakshmi Pooja: చెడు అనే చీకట్లను పాలద్రోలి.. మంచి అనే వెలుగును ఇచ్చే దీపావళి పండుగ వేడుక జరుపుకునే సమయం ఆసన్నమైంది. ప్రతి ఏడాది అశ్వయుజ మాసంలో అమావాస్య రోజున జరుపుకునే ఈ దీపావళి పండుగ ఒక్కరోజుతో పూర్తయ్యేది కాదు. దీపావళిని ఐదు రోజులపాటు వేడుకలు నిర్వహించుకుంటారు. ఐదు రోజుల దీపావళిలో ముందుగా వచ్చేది ధన త్రయోదశి, ఆ తర్వాత నరక చతుర్థి, దీపావళి వేడుకలను ఎక్కువగా నిర్వహించుకుంటారు. అయితే దీపావళి తర్వాత కొందరు నోముల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి ఏటా దీపావళి పండుగ ఎప్పుడు? అన్న సందేహం కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే హిందూ క్యాలెండర్ ప్రకారం తిథులను బట్టి పండుగలను నిర్ణయిస్తారు. అయితే రెగ్యులర్ క్యాలెండర్ కు ఇవి ఒక్కోసారి భిన్నంగా ఉంటాయి. ఈ ఏడాది దీపావళి పండుగ ఎప్పుడు నిర్వహించుకోవాలి? ఎప్పుడు లక్ష్మీ పూజలు చేయాలి?
అశ్వయుజ మాసం కృష్ణపక్షం అమావాస్య రోజున దీపావళి పండుగను నిర్వహించుకుంటారు. 2025వ సంవత్సరంలో అక్టోబర్ 20వ తేదీన సాయంత్రం 3.42 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమై 21 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ప్రదోషకాలంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. అందువల్ల 20వ తేదీన సాయంత్రం ప్రదోషకాలంతోపాటు అమావాస్య కూడా ఉండడంతో 20వ తేదీని దీపావళి పండుగను నిర్వహించుకోవాలని పండితులు తెలుపుతున్నారు. అలాగే 20వ తేదీన సాయంత్రం 5.45 గంటల నుంచి రాత్రి 8.15 గంటల వరకు ప్రదోష కాలం ఉంటుంది. ఈ కాలంలో అంటే సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు లక్ష్మీ పూజ నిర్వహించుకోవడం వల్ల శుభప్రదం అని అంటున్నారు. ఈ సమయంలో పూజలు నిర్వహించుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రతి ఏటా దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీ పూజలను నిర్వహిస్తుంటారు. ఇళ్లలోనూ, వ్యాపార సముదాయాల్లోనూ లక్ష్మీ పూజలను నిర్వహిస్తారు. అయితే దీపావళి కంటే రెండు రోజుల ముందు అంటే అక్టోబర్ 18న శని త్రయోదశి, ధన త్రయోదశి ఒకేరోజు రాబోతున్నాయి. దీంతో ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో దక్షిణ ముఖంగా దీపం ఉంచుతారు. ఈరోజు పితృదేవతలు ఇంటికి వస్తారని వారిని సంతోష పరచడానికి ఇలా కుటుంబ యజమాని దక్షిణ ముఖంగా దీపం ఉంచడం వల్ల వారు శాంతిస్తారని పేర్కొంటారు. అలాగే ఈరోజు ధన త్రయోదశి కారణంగా లక్ష్మీదేవికి కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఈరోజు లక్ష్మీదేవికి అనుగ్రహమైన బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. అక్టోబర్ 19న నరక చతుర్థి నిర్వహిస్తారు. విష్ణుమూర్తి, భూదేవికి జన్మించిన నరకుడిని ఈరోజే సత్యభామ సంహరిస్తుంది. అందుకే ఈరోజును నరక చతుర్థి అని పేర్కొంటారు. ఈ సందర్భంగా నువ్వుల తైలంతో ఈరోజు స్నానం చేయడం వల్ల అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండగలుగుతారని పండితులు చెబుతున్నారు. అలాగే ఈరోజు దీపదానం చేయడం వల్ల కూడా అంతా మంచే జరిగే అవకాశం ఉందని అంటున్నారు.