ORS Hyderabad Doctor: మనదేశంలో అవసరాల ఆధారంగానే వ్యాపారాలు సాగుతుంటాయి.. ఈ వ్యాపారాలు ఒకప్పుడు నాణ్యంగా సాగుతుండేవి. ఎప్పుడైతే ఇందులోకి కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించాయో.. అప్పుడే వ్యాపారాలు పూర్తిగా మారిపోయాయి. నాణ్యమైన వస్తువులు కాస్త కల్తీగా మారిపోయాయి. ప్రజల ఆరోగ్యాలు పక్కన పెడితే.. కంపెనీలు దండిగా దండుకోవడం మొదలుపెట్టాయి. ఆ కంపెనీలు మన ప్రభుత్వాలకు నజరానాలు ఇస్తుండడంతో ఈ దందా సాగిపోయింది. వాస్తవానికి తమ దందాను ఎవరూ ఎదుర్కోలేరు. ఎవరూ ఆపలేరన్న ధైర్యంతో కంపెనీలు ఇప్పటివరకు ఉన్నాయి. అయితే అటువంటి కంపెనీలకు ఓ మహిళ ఎదురొడ్డి పోరాడింది. వాటి లక్షల కోట్ల వ్యాపారానికి గండి కొట్టింది. ప్రధాన మీడియా ఆ మహిళ గురించి పట్టించుకోలేదు. కానీ సోషల్ మీడియా ఆమె పోరాటానికి నీరాజనాలు పలికింది.
ఆమె పేరు డాక్టర్ శివరంజని. హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధ చిన్నపిల్లల వైద్యురాలు. కొన్ని సంస్థలు మనదేశంలో ఓఆర్ఎస్ పేరుతో దుర్వినియోగం చేస్తున్నాయని ఆమె మొదటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ ఆధారాలతో సహా నిరూపిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మన తోలు మందం ప్రభుత్వాలు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఇన్నాళ్లకు ఆమె పోరాటానికి భారత ప్రభుత్వం దిగివచ్చింది. ఆమె చూపించిన ఆధారాలతో భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ఏకీభవించింది. అంతేకాదు ఆమె పోరాటానికి మద్దతుగా చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వల్ల మన దేశ వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులకు ఎంతో ఉపశమనం కలిగింది. వారి పిల్లలకు సాంత్వన లభించింది. వైద్యులకు గొప్ప ఊరట కలిగించింది.
మన శరీరంలో లవణాలు బయటకు పోయినప్పుడు ఓఆర్ఎస్ ఇస్తుంటారు. దీనివల్ల శరీరం మళ్ళీ లవణాలను సంపాదించుకుంటుంది. వారసు అనేది ఉప్పు, చక్కెర, ఎలక్ట్రోలైట్ సమాన నిష్పత్తి కలిగిన ఔషధ మిశ్రమం. శుభ్రమైన నీటిలో కరిగించి తాగడం వల్ల శరీరం కోల్పోయిన ద్రవాలను సొంతం చేసుకుంటుంది. లవణాలను తిరిగి సంపాదించుకుంటుంది. అయితే కొంతకాలంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఓఆర్ఎస్ పదాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి. ఓ ఆర్ ఎస్ ద్రావణాన్ని చక్కెర పానీయంగా మార్చేశాయి. జ్యూస్ లను, ఎనర్జీ డ్రింకులను మార్కెట్లోకి తెచ్చేసాయి. వీటిల్లో ఓఆర్ఎస్ లో ఉన్నట్టుగా నిజమైన ఔషధ గుణాలు అసలు ఉండదు. పేరులో పోలిక ఒకే తీరుగా ఉండటం వల్ల తల్లిదండ్రులు వీటిని నిజమైన ఓఆర్ఎస్ గా పోరాబడుతూ.. అత్యవసర సమయాలలో తమ పిల్లలకు తాగిస్తున్నారు. ఇలాంటి ద్రావణాలు తాగించడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటున్నది. దీనిని గుర్తించిన డాక్టర్ శివరంజని తన పోరాటం మొదలుపెట్టారు. ఎక్కడబంది ఆధారాలతో వివిధ వేదికల మీద తన వాదన అత్యంత బలంగా వినిపించారు. ఆమె చేసిన కృషిని గుర్తించిన fssai ఇన్నాళ్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలకు తగ్గట్టుగా తయారుచేసిన ఉత్పత్తులకు మాత్రమే ఓఆర్ఎస్ అనే పదం వాడుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఇతర ద్రావణాలకు ఓఆర్ఎస్ అనే పదాన్ని వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు సరైన ఓఆర్ఎస్ మాత్రమే లభిస్తుందని.. పిల్లల ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుందని శివరంజని పేర్కొంటున్నారు. శివరంజని చేసిన పోరాటం వల్ల కార్పొరేట్ కంపెనీల లక్షల కోట్ల దందాకు అడ్డుకట్టపడింది. అన్నిటికంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల పిల్లల ఆరోగ్యం మెరుగు పడనుంది. వాస్తవానికి శివరంజని చేసిన పోరాటాన్ని మీడియా పట్టించుకోలేదు. సోషల్ మీడియా మాత్రం గుర్తించింది. అందువల్లే ఆమె పోరాటం దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది.