Krishnashtami : దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సౌత్ కంటే నార్త్ వాళ్లు ఎక్కువగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే పండుగలను తిథుల బట్టి ఏ రోజు జరుపుకోవాలి అని నిర్ణయిస్తారు. కొన్ని పండుగలు రెండు రోజులు ఉంటాయి. వీటికి కారణం తిథి అనే రెండు రోజులు ఉంటుంది. ఇలా కొన్నిసార్లు జరుగుతుంది. దీంతో చాలామంది గందరగోళానికి గురవుతారు. అయితే తిథి ఉండే సమయాన్ని బట్టి పండుగ జరుపుకోవాలి. అయితే మరి ఈ ఏడాది కృష్ణాష్టమి పండుగను ఏ రోజు జరుపుకోవాలి? ఆగస్టు 26 లేదా 27వ తేదీన? పూజ ఏ సమయంలో చేయాలి? అసలు పూజా విధానం ఏంటి? పూర్తి వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం.
హిందూ పంచాంగంలో శ్రావణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు కృష్ణాష్టమి పండుగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీన సోమవారం తెల్లవారు జామున 3:39 గంటలకు అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మళ్లీ ఆగస్టు 27వ తేదీన మంగళవారం తెల్లవారు జామున 2:19 గంటలకు తిథి ముగిస్తుంది. అయితే కృష్ణాష్టమి పండుగ జరుపుకోవాలంటే సూర్యోదయంలో తప్పకుండా రోహిణ నక్షత్రం కూడా ఉండాలి. అయితే రోహిణి నక్షత్రం ఆగస్టు 26న మధ్యాహ్నం 3:55 గంటలకు మొదలయ్యి, మరుసటి రోజు ఆగస్టు 27న మధ్యాహ్నం 3:38 గంటలకు ముగిస్తుంది. దీంతో పండితులు ఈ పండుగను కొందరు స్మార్త, వైష్ణవ కృష్ణాష్టమి అనే రెండు రకాలుగా జరుపుకుంటారని చెబుతున్నారు.
స్మార్త కృష్ణాష్టమిని ఆగస్టు 26న జరుపుకుంటారు. ఈ స్మార్త కృష్ణాష్టమిని జరుపుకోవడానికి సూర్యోదయంలో రోహిణి నక్షత్రం ఉండాలని ఏం లేదు. ఆ రోజులో ఎప్పుడైనా రోహిణి నక్షత్రం ఉంటే చాలు. వైష్ణవ కృష్ణాష్టమిని జరుపుకునేవాళ్లు రోహిణి తిథి సూర్యోదయంలో ఉండేట్లు చూసుకుంటారు. దీని ప్రకారం ఆగస్టు 27న ఉదయం రోహిణి తిథి ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీ సోమవారం ఈ పండుగను జరుపుకుంటున్నారు. సోమవారం అర్థరాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు అర్థరాత్రి 12:44 వరకు జరుపుకుంటారు. ఆగస్టు 27న ఉదయానికి నవమి తిథి మొదలవుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా అందరూ ఆగస్టు 26న శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల ఉట్టి కొట్టడం మాత్రం ఆగస్టు 27న మంగళవారం జరుపుకుంటున్నారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజూ ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కృష్ణుడికి జలాభిషేకం చేయాలి. కన్నయ్యకు ఇష్టమైన వంటలు పెట్టాలి. సాయంత్రం సమయంలో కన్నయ్యను ఊయలలో వేయాలి. పూజ చేయాలి. అయితే కృష్ణాష్టమి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు. దీనివల్ల మంచి జరుగుతుందని ప్రజలు ఎక్కువగా నమ్ముతారు.