CM Chandhrababu : ఏపీ రాజకీయాల్లో బెంగళూరు కీలకంగా మారుతోంది. ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత జగన్ ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్నారు. వారంలో మూడు రోజులు పాటు అక్కడే ఉంటున్నారు. అక్కడ జగన్ కు భారీ ప్యాలెస్ ఉంది. రాజకీయాల్లో ప్రవేశానికి ముందే బెంగళూరు నుంచి ఆయన కార్యకలాపాలు సాగించేవారు. అయితే ఇటీవల ఓడిపోయిన దగ్గరి నుంచి ఎక్కువగా బెంగళూరులో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇండియా కూటమిలో చేరేందుకు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారని.. అదే సమయంలో బిజెపికి సైతం సంకేతాలు పంపుతున్నారని పుకార్లు షికార్లు చేశాయి. ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఎన్డీఏ ఉంది. ఆ కూటమిలో టిడిపి తో పాటు జనసేన భాగస్వామ్యం అయ్యాయి. దీంతో కచ్చితంగా ఇండియా కూటమి వైపు వెళ్లాల్సిన అవసరం జగన్ కు ఏర్పడింది. అయితే చంద్రబాబుకు సైతం జాతీయస్థాయిలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం, ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన డీకే శివకుమార్ చంద్రబాబుకు సన్నిహితుడు అన్న ప్రచారం ఉంది. గతంలో ఎయిర్పోర్ట్లో కలిసిన వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడిన వీడియోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. జగన్ కు వ్యతిరేకంగా షర్మిలను కాంగ్రెస్ లో యాక్టివ్ చేసేందుకు అప్పట్లో చంద్రబాబు పావులు కదిపారని వైసిపి అనుమానిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడానికి జగన్.. తరచూ బెంగళూరు వెళుతున్నారు అన్నది పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్.
* ఇప్పుడు చంద్రబాబు మాట
జగన్ మాట అటుంచితే.. ఇప్పుడు చంద్రబాబు సైతం బెంగళూరు బాట పట్టారన్నది కొత్త వార్త. శుక్రవారం గోదావరి జిల్లాలో గ్రామసభ ముగించుకుని.. చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లో బెంగళూరు వెళ్లారన్నది ఒక వార్త. అక్కడ రెండు గంటలపాటు గడిపారని.. అక్కడ ఎవరెవరిని కలిశారని.. పర్యటనను ఎందుకు గోప్యంగా ఉంచారని వైసిపి ప్రశ్నించింది. ఇదే విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో బయటపెట్టింది. అధికారికంగా షెడ్యూల్ ఎందుకు విడుదల చేయలేదని వైసిపి ఎత్తిచూపుతోంది.
* ఎవరిని కలిశారు
ఒకవేళ చంద్రబాబు నిజంగా బెంగళూరు వెళ్లారా? వెళ్తే ఎవరిని కలిశారు? అన్నది ఇప్పుడు చర్చకు వచ్చే విషయం. బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాజకీయ చర్చలు జరపడానికి అక్కడ ఎన్డీఏ కాదు. అయితే చంద్రబాబుకు అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. 2018లో కర్ణాటక ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం కూడా చేశారు. కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీతో కలిసి వేదికలు పంచుకున్నారు. అప్పటినుంచి కర్ణాటక కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఇప్పుడు వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. బిజెపికి అనుమానం కలిగేలా ప్రచారం చేయడం ప్రారంభించింది.
* వరుస నేతల తాకిడి
జగన్ కు బెంగళూరులో యలహంక ప్యాలెస్ ఉంది. ఓడిపోయిన తర్వాత తరచూ అక్కడే విడిది చేస్తున్నారు. దీంతో బెంగళూరు కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ మధ్యనే పవన్ బెంగళూరు వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులను కలిశారు. ఇప్పుడేమో చంద్రబాబు బెంగళూరు వెళ్లారని వైసీపీ చెబుతోంది. ప్రభుత్వం నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.