https://oktelugu.com/

Kolkata Trainee Doctor Case  : కోల్‌కతా అత్యాచార నిందితుడికి పాలిగ్రాఫ్‌ టెస్ట్‌.. అసలేంటీ పరీక్ష, నిజం ఎలా తెలుస్తుంది?

కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ కోల్‌కత్తాతోపాటు దేశవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి. సుప్రీం కోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 25, 2024 / 10:09 AM IST

    Polygragh Test

    Follow us on

    Kolkata Trainee Doctor Case  : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా… లైంగిక దాడులు ఆగడం లేదు. దేశంలో గంటకో లైంగిక దాడి జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు అని తేడా లేకుండా మహిళ ఐతే చాలు అన్నట్లు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. అత్యాచారం జరగని రోజంటూ ఉండడం లేదు. బడి, గుడి, ఆఫీస్, పరిశ్రమ, వాహనం ఇలా అన్ని చోట్లా మహిళలకు రక్షణ లేకుండాపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు రూపొందించినా మృగాళ్లు మహిళలపై అఘాయిత్యాలు ఆపడం లేదు. 2012లో నిర్భయ ఘటన సంచలనం సృష్టించగా, రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో దిశ ఘటన మరో సంచలనంగా మారింది. ఇక తాజాగా కోల్‌కతాలోని ఆర్జికార్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన నిర్భయను మించిన సంచలనంగా మారింది. ఈ ఘటనపై నిందితుడు సంజయ్‌రాయిన్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే.. కోల్‌కతా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణలో సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్‌ రాయ్‌కి పాలీగ్రాఫ్‌ టెస్టుకు అనుమతి కోరింది. సంజయ్‌ రాయ్‌తోపాటు మరో ఆరుగురికి కూడా ఈ పాలీగ్రాఫ్‌ టెస్ట్‌ చేపట్టారు. సంజయ్‌ రాయ్‌ ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండగా.. అతనికి జైలులోనే ఈ లైడిటెక్టర్‌ టెస్టు శనివారం(ఆగస్టు 24న)నిర్వహించారు. ఈ పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక నిపుణుల బృందం కోల్‌కతా చేరుకుంది. సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ టీమ్‌.. ఈ లై డిటెక్టర్‌ నిర్వహిస్తోంది. ఇక సంజయ్‌ రాయ్‌తోపాటు ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌.. బాధితురాలిపై హత్యాచార ఘటన చోటు చేసుకున్న రోజున ఆస్పత్రిలో విధుల్లో ఉన్న మరో నలుగురు డాక్టర్లు, మరో సివిల్‌ వాలంటీర్‌కు కూడా పాలీగ్రాఫ్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు.

    పాలీగ్రాఫ్‌ టెస్ట్‌ అంటే..
    పాలీగ్రాఫ్‌ టెస్ట్‌నే లై డిటెక్టర్‌ టెస్ట్‌ అని కూడా అంటారు. ఏదైనా కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు విచారణలో దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు నిజాలు చెబుతున్నారా లేక అబద్ధాలు చెబుతున్నారా అనే విషయాన్ని ఈ పాలీగ్రాఫ్‌ టెస్ట్‌ ద్వారా గుర్తిస్తారు. అయితే ఈ లైడిటెక్టర్‌లో ఎలాంటి మెడిసిన్‌ గానీ.. మత్తు మందులను గానీ ఉపయోగించరు. కేవలం ఆ నిందితుల శరీరానికి కార్డియో కఫ్‌లు లేదా తేలికపాటి ఎలక్ట్రోడ్‌లతోపాటు ఇతర పరికరాలు మాత్రమే అమర్చుతారు. వాటి ఆధారంగా ఆ వ్యక్తి బీపీ, శ్వాసక్రియ రేటును పర్యవేక్షిస్తారు. దర్యాప్తు అధికారులు ప్రశ్నలు అడిగినపుడు నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో.. అతని శరీరం ఎలా స్పందిస్తుందో తెలుసుకునేందుకు పరికరాలు ఉంటాయి. నిందితుడు అబద్ధం చెప్తే.. ఆ సమయంలో అతడి శరీరంలో మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా బీపీ, శ్వాసక్రియ రేటులో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి. వీటి ఆధారంగా నిందితుడు చెప్పేది నిజమా.. కాదా అని వాటికిచ్చిన నంబర్‌ ఆధారంగా దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్‌ నిపులు గ్రహిస్తారు. అయితే ఇందులో వ్యక్తి వాస్తవాలను దాచేందుకు ఆస్కారం ఉంటుందని కొందరు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ను 19వ శతాబ్దంలో ఓ ఇటలీ క్రిమినాలజిస్ట్‌ తొలిసారి వినియోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

    నార్కో అనాలసిస్‌..
    నార్కో అనాలసిస్‌ అనేది గ్రీకు పదమైన నార్కో (అనెస్థీషియా అని అర్థం) నుంచి వచ్చింది. ఈ పరీక్షలో భాగంగా వ్యక్తి శరీరంలోకి ఓ ఔషధాన్ని (సోడియం పెంటోథాల్, స్కోపలామైన్‌.. సోడియం అమైదాల్‌) ఎక్కిస్తారు. దీన్నే ట్రూత్‌ సీరం అని కూడా అంటారు. ఆ వ్యక్తి వయసు, ఆరోగ్యం, భౌతిక స్థితి ఆధారంగా ఔషధ డోసును ఇస్తారు. ఇది ఇచ్చిన కొన్ని సెకన్లలోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఈ సమయంలో వ్యక్తి నాడీ వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తారు. ఆ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలికగా సమాధానాలు వెల్లడిస్తాడు. స్పృహలో ఉన్నప్పుడు చెప్పని విషయాలనూ స్వేచ్ఛగా బహిరంగపరుస్తాడు. ఆ సమయంలో ఆయన పల్స్, బీపీని నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తారు. ఒకవేళ అవి పడిపోతున్నట్లు గ్రహిస్తే.. వెంటనే నిందితుడికి ఆక్సిజన్‌ అందిస్తారు.

    ఇవి తప్పనిసరి..
    – పాలిగ్రాఫ్, నార్కో అనాలసిస్‌ టెస్టులకు ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి. అతడి అంగీకారం లేకుండా బ్రెయిన్‌ మ్యాపింగ్, పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్‌ టెస్టులను నిర్వహించకూడదని సుప్రీం కోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. అయితే, నార్కో అనాలసిస్లో వ్యక్తి ఇచ్చే స్టేట్‌ మెంట్లను ప్రధాన సాక్ష్యాలుగా కోర్టులు పరిగణించవు. కేవలం వాటిని ఆధారంగానే తీసుకుంటాయి. ఈ పరీక్షలు నిర్వహించేందుకు మేజిస్ట్రేట్‌ అనుమతి అవసరం.

    – గతంలో చాలా కీలకమైన కేసులను ఛేదించడంలో ఈ పద్ధతులను ఉపయోగించారు. 2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్ల కేసు, అబ్దుల్‌ కరీం తెల్లీ స్టాంపు పేపర్ల కుంభకోణం, 2006లో నోయిడా సీరియల్‌ మర్డర్స్, 26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో కసబ్‌ విచారణ సమయంలో నార్కో పరీక్షలు నిర్వహించారు.

    – అలాగే, 2022లో ఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ను అత్యంత కిరాతకంగా ముక్కలుగా కోసి చంపిన కేసులో అఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్‌ పరీక్ష చేసిన విషయం తెలిసిందే. తాజాగా కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో నిందితుడికి పాలిగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించేందుకు కోర్టు అనుమతిచ్చింది.