Sri Rama Navami: ధర్మ రక్షణకు మహావిష్ణువు ధరించిన వాటిల్లో శ్రీరామ, కృష్ణ అవతారాలు సంపూర్ణమైనవి. ఇవి అప్పటికప్పుడు ఆవిర్భించనవి కాబట్టి అంశ అవతారాలని పురాణాలు చెబుతున్నాయి.. మత్స్య, కూర్మ, హయగ్రీవ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, కల్కి అవతారాలు కూడా ముఖ్యమైనవే. కాకపోతే వివిధ అవసరతల ఆధారంగా శ్రీ మహా విష్ణువు ఆ రూపాలలో అవతరించాడు..
రామావతారంలో మానవాళిని సత్యవాక్య పాలకులుగా తీర్చిదిద్ది.. సన్మార్గంలో నడిపించేందుకు మానవుడిగా అవతరించాడు. అందరిలాగే ఎన్నో కష్టాలు పడ్డాడు. నష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ ధర్మాన్ని తప్పలేదు. నీతిని వదలలేదు. నిజాన్ని మాత్రమే పలికాడు. అందువల్లే అతి సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు రాముడు దేవుడయ్యాడు. ఆరాధ్య దైవమయ్యాడు. ఉత్తమ మానవుడు ఎలా ఉండాలో తన నడవడిక ద్వారా నిరూపించి సకల గుణాభిరాముడయ్యాడు.
కల్యాణ వైభోగమే
శ్రీహరి రాముడిగా ఈ భూమిపైన అవతరించిన పుణ్య తిథి శ్రీరామనవమి. ఈ పర్వదినం 9 రోజులు జరుపుతారు. చైత్ర శుక్ల పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకు పూజాదికాలు, రామనామ పారాయణం చేస్తారు. వాస్తవానికి చైత్రమాసం ప్రారంభం నుంచే ఇంటింటా, వాడవాడలా, వీధి వీధినా చలువ పందిళ్లు, మామిడాకు తోరణాలు.. ఇలా ప్రతి చోటా కళ్యాణ సంబరాలు ప్రారంభమవుతాయి. రామయ్య కళ్యాణాన్ని పురస్కరించుకొని నాడు కంచర్ల గోపన్న భక్త రామదాసుగా శ్రీరామసేవ దీక్షను స్వీకరించాడని పురాణాలు చెబుతున్నాయి. నాడు కంచెర్ల గోపన్న సీతారాములకు తిరు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. నాటి నుంచి సిరి కళ్యాణ తిలకం, మణిమయ బాసికాలు, ఆణిముత్యాలే తలంబ్రాలుగా, జాలువారే ముగ్ద మనోహరమైన, మనోరంజకమైన సీతారాముల కళ్యాణం జగదానంద కారకమై భాసిల్లుతోంది. శ్రీరామనవమి మరుసటి రోజు దశమి సందర్భంగా రామయ్యకు పట్టాభిషేకం నిర్వహిస్తారు.
శ్రీరామనవమి నాడు ఏం చేయాలంటే..
త్రేతా యుగంలో వసంత రుతువు, చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం లో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడి పరిణయ క్రతువు సీతాదేవితో నిర్వహిస్తారు. వాస్తవానికి శ్రీరామనవమి అనేది పాపాలను తొలగించే వేడుక అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామనవమి నాడు సీతా సమేత రాముడి విగ్రహాలను, లక్ష్మణుడి, ఆంజనేయుడి, భరత, శత్రుఘ్నుల చిత్రపటాలను పవిత్ర జలాలతో శుభ్రం చేయాలి. వాటిని పూలతో అలంకరించాలి. గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించాలి. ఇళ్లను శుభ్రం చేసి ముగ్గులు పెట్టాలి. వడపప్పు, బెల్లం పానకం, చక్కర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం చెరుకు గడలను, చలిమిడి స్వామివారికి నివేదించాలి. రామ నామాన్ని జపించాలి. రామాయణంలో స్తోత్రాలను చదవాలి. అనంతరం పలువురికి విసనకర్రలు దానం చేయాలి. రాముడు పట్టాభిషేకం చేసుకున్న అనంతరం అయోధ్య వాసులు వింజామరలు(విసనకర్రలు) బహుమతిగా ఇచ్చారట. అందుకే విసనకర్రలు అంటే రాములవారికి అమితమైన ఇష్టం. ఈ కాలంలో విప్ప పూలు ఎక్కువగా పూస్తూ ఉంటాయి కాబట్టి వాటిని స్వామివారికి సమర్పిస్తే పుణ్యం దక్కుతుందని ప్రతీతి.
పురాణ కాలంలో దమ్మక్క రాముడి శిలా విగ్రహానికి విప్పపూలతోనే పూజలు చేసిందట. అందుకే రాముడికి విప్పపూలు అంటే అమితమైన ఇష్టం. రామ కళ్యాణ తలంబ్రాలను పూజ గదిలో ఉంచి.. ధార్మిక కార్యక్రమాలలో వినియోగిస్తే శుభం జరుగుతుందని.. పెళ్ళికాని వారికి వివాహం అవుతుందని ప్రతీతి.