Ugadi 2024 – Rashiphalalu : కాదేదీ మీమ్స్ కు అనర్హం.. చివరికి రాశి ఫలాలను కూడా వదిలిపెట్టడం లేదు..

ఈ మీమర్స్ కు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో తెలియదు గానీ.. వాటిని చూస్తుంటే నవ్వు ఆగడం లేదు. ఒకటా రెండా.. వేలకొద్దీ మీమ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. కేవలం వీటి కోసమే కొన్ని వేల పేజీలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఎక్స్ లో రన్ అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు

Written By: NARESH, Updated On : April 9, 2024 6:36 pm

Ugadi 2024

Follow us on

Ugadi 2024 – Rashiphalalu : అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిల్ల కాదేదీ కవితకు అనర్హమని శ్రీశ్రీ రాస్తే.. సంక్రాంతి నుంచి దీపావళి వరకు కాదేదీ మీమ్స్ కు అనర్హమని మీమర్స్ నిరూపిస్తున్నారు. సోషల్ మీడియా కాలంలో ఉగాది పండుగను కూడా వదిలిపెట్టడం లేదు మీమర్స్. రాశి ఫలాల ఆధారంగా చిత్రవిచిత్రమైన మీమ్స్ రూపొందించి పండగపూట నవ్వులు పూయిస్తున్నారు. హిట్ సినిమాల్లోని కడుపుబ్బా నవ్వించే సన్నివేశాల తాలూకూ దృశ్యాలతో మీమ్స్ రూపొందించి వారెవా అనిపిస్తున్నారు. వారి క్రియేటివిటీ చూస్తుంటే.. వారెవా అనకుండా ఉండలేం. ఒక మీమ్ బాగుంది అనిపించే లోపే.. దానిని తలదన్నెలా మరో మీమ్ ఉంటున్నది. ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఆ రాశుల వారే లక్ష్యంగా…

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని పండితులు పంచాంగంలో వివిధ రాశుల వారి స్థితిగతులను పొందుపరిచారు. ఇక వారి రూపొందించిన పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది వృషభం రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా ఉంది. రాజపూజ్యం ఏడు, అవమానం మూడుగా ఉంది. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు, రాజపూజ్యం 4, అవమానం అయిదుగా ఉంది. మేషం రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం మూడుగా ఉంది. మరీ దారుణంగా సింహం రాశి వారికి రెండు ఆదాయం, ఖర్చు 14, రాజపూజ్యం 2, అవమానం రెండుగా ఉంది. మకరం, కుంభం రాశుల వారికి నో ప్రాఫిట్, నో లాస్ అన్నట్టుగా ఉంది. 14 ఆదాయం, 14 ఖర్చుగా ఉంది. మకర రాశి వారికి రాజ్య పూజ్యం మూడుగా, అవమానం ఒకటిగా ఉంది. కుంభ రాశి వారికి రాజపూజ్యం 6, అవమానం ఒకటిగా ఉంది. అయితే ఈ రాశుల వారికి ఈ ఏడాది బాగోలేదు కాబట్టి మీమర్స్ తమ మేధస్సుకు పదును పెట్టారు. రకరకాల మీమ్స్ రూపొందించారు. మిగతా ధనస్సు, కర్కాటకం రాశుల వారిని ఆకాశానికి ఎత్తేస్తూ.. మిగతావారిని గేలి చేస్తూ మీమ్స్ రూపొందించారు.

ఈ మీమర్స్ కు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో తెలియదు గానీ.. వాటిని చూస్తుంటే నవ్వు ఆగడం లేదు. ఒకటా రెండా.. వేలకొద్దీ మీమ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. కేవలం వీటి కోసమే కొన్ని వేల పేజీలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఎక్స్ లో రన్ అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ రాశి ఫలాలను నిజమని నమ్మే వాళ్ళు ఉన్నారు. అబద్ధమని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఉగాది అనేది మన తెలుగు సంవత్సరాది. మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉన్నది. అందుకే తెలుగు వారికి ఉగాది అంటే అత్యంత ఇష్టమైన పండుగ. ఈ పండుగ సందర్భంగా కాసేపు నవ్వుకుంటే తప్పులేదుగా..అందుకే మీమర్స్ రూపొందించిన మీమ్స్ ను తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. తమలో తాము నవ్వుకుంటూ ఒత్తిడిని తగ్గించుకుంటున్నారు. ఈ పండగపూట అంతకు మించి కావాల్సింది మరేముంది.. కాకపోతే ఈ మీమ్స్ నవ్వు తెప్పించే విధంగా ఉండాలి కానీ.. రూపొందించిన వాడిని కొట్టేలా ఉండకూడదని నెటిజన్ల అభిప్రాయం.