Thirumala Laddu : తిరుపతి శ్రీవారి లడ్డూకి 309 ఏళ్లు పూర్తి..ప్రసాదం వెనుక కథ ఇది!

తిరుమలలో శ్రీవారి దర్శనం ముక్తికి మార్గం అంటారు. తిరుమలలో ప్రతి దృశ్యం ఒక పావనమే. ప్రతి అంశం అనుభూతి కలిగించినదే. ముఖ్యంగా లడ్డూ ప్రసాదం, స్వామివారి నైవేద్యాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. 

Written By: Dharma, Updated On : August 4, 2024 10:49 am
Follow us on

Thirumala Laddu : తిరుమలలో శ్రీవారిని నిత్యం లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీనివాసుడి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి ఎంత ఆనందిస్తారో.. శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి కూడా అంతే గొప్పగా అనుభూతి పొందుతారు. తిరుమల శ్రీవారి లడ్డూ  ప్రసాదానికి భక్తులు ప్రత్యేక స్థానం కూడా ఇస్తారు. ఏడుకొండలు ఎక్కి వెంకన్నను దర్శించుకున్నంత పుణ్యం.. తిరుపతి లడ్డూను తింటే వస్తుందని నమ్మకం భక్తుల్లో ఎక్కువగా ఉంటుంది. తిరుమల వెంకన్న కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడని, తమ కష్టాలను తొలగించే దివ్య పురుషుడని భక్తుల విశ్వాసం. అందుకే నిత్యం లక్షల మంది భక్తులు తరలి వస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని పెద్ద ఎత్తున లడ్డులను కొనుగోలు చేస్తుంటారు. తమతో ఇంటికి తీసుకెళ్లి బంధుమిత్రులకు పంపిణీ చేస్తుంటారు. ఈ లడ్డూను తమ ఇంటిలో భక్తిశ్రద్ధలతో పూజించి ఆత్మీయులకు పంచి పెడుతుంటారు.అంతటి విశిష్టమైన లడ్డూ మూడు శతాబ్దాలను పూర్తి చేసుకుంది. ఆలయ పోటులో ప్రత్యేకంగా తయారయ్యే  ఈ లడ్డూలను స్వామివారి ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించి.. ఇప్పటికి 309 ఏళ్లు పూర్తయ్యాయి. తొలిసారిగా 1715 ఆగస్టు 2న తిరుమలలో లడ్డూ  ప్రసాదం పంపిణీ చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాలానుగుణంగా పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రతిరోజు దాదాపు మూడు లక్షల 20వేల లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేస్తోంది. ఇంతటి విశిష్టత, ప్రాధాన్యత కలిగిన తిరుపతి లడ్డూకు  పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉన్నాయి. 2014లో ఏకంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపు కూడా లడ్డూ కి లభించింది.
 * తరగని ముద్ర 
 తిరుపతి లడ్డూకి తరగని ముద్ర ఉంది. తరాలు మారుతున్న తరగని రుచితో హిందువుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. సుప్రభాత సమయంలో స్వామివారికి వెన్నతో మొదలుపెట్టి.. లడ్డూ, వడ, పొంగలి, దద్దోజనం, పులిహోర, వడపప్పు.. ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు.  ఈ ప్రసాదం అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరం. అందుకే భక్తులు సైతం ఈ ప్రసాదాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇంటికి తీసుకెళ్లి బంధుమిత్రులకు  అందిస్తారు.
 * అనేక ప్రత్యేకతలు
 తిరుపతి లడ్డూ రుచి వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అంతలా లడ్డు తయారీలో నాణ్యతకు పెద్దపీట వేస్తారు. కానీ ఇతరులు ఎవరు చేసినా ఆ రుచి రాదు. శ్రీవారి ఆశీస్సులు ఉండడం వల్లే ఈ లడ్డూలకు అంత రుచి వచ్చిందని చెబుతారు. అయితే ఈ లడ్డూ పరిచయం వెనుక చాలా ప్రాశస్త్యం ఉంది. 1803లో బూందీగా పరిచయమైంది. 1940 నాటికి లడ్డూగా మారిందని చెబుతారు. అంతకుముందు శ్రీవారికి వివిధ రకాల నైవేద్యాలు పెట్టేవారు.కార్యక్రమంలో అవి మారుతూ వచ్చాయి.తొలి రోజుల్లో లడ్డు పరిమాణం కల్యాణోత్సవం నాడు పెట్టే లడ్డూలా ఉండేది. ఎన్నో గ్రంథాల్లోనూ తిరుపతి లడ్డూ ప్రస్తావన ఉండేది. లడ్డు ప్రసాదానికి 309 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే వాస్తవిక ప్రామాణికంగా తీసుకుంటే 82 సంవత్సరాలు అన్నమాట.
* ప్రత్యేకంగా తయారీ
 తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలు తయారు చేసే వారిని గేమేకర్ మిరాసిదారులు అని పిలుస్తారు. వీటి తయారీలో శుచి శుభ్రత పాటిస్తారు. నాణ్యతకు పెద్దపీట వేస్తారు. అందుకే లడ్డూలు రోజుల తరబడి కూడా నిల్వ ఉంటాయి. కొందరు లడ్డూల కోసమే తిరుపతి వెళ్తారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 300 సంవత్సరాలు దాటుతున్నా తిరుపతి లడ్డూల ప్రాశస్త్యం మాత్రం తగ్గకపోవడం విశేషం.