Aravana Payasam: అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తర్వాత మాలధారులు, ఇతర భక్తులు ఆరవణ ప్రసాదాన్ని కొనుగోలు చేస్తుంటారు.. ఈ ప్రసాదాన్ని బెల్లం, సుగంధ ద్రవ్యాలు, స్వచ్ఛమైన నెయ్యి, ఇతర దినుసులతో అయ్యప్ప దేవస్థానం బోర్డు తయారు చేస్తూ ఉంటుంది. ప్రత్యేకమైన పాక శాస్త్ర నిపుణులు ఈ ప్రసాదాన్ని తయారు చేస్తుంటారు. అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే భక్తులకు నోరూరుతుంది. ఈ ప్రసాదాన్ని ఇష్టపడని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు.
అయ్యప్ప స్వామికి ఆరవణ ప్రసాదం మాత్రమే కాదు, ఇంకా నాలుగు రకాల పాయసాలను నివేదిస్తుంటారు. ఇవి ఆయుర్వేద పరంగా అత్యంత విలువైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయని.. తక్షణమైన శక్తిని ఇస్తాయని భక్తులు నమ్ముతుంటారు. అయ్యప్ప స్వామికి నివేదించే ఆ నాలుగు పాయసాల గురించి, వాటి ప్రత్యేకతల గురించి ఒకసారి తెలుసుకుందాం.
ఉదయం 7:30 సమయంలో హాజప్ప స్వామి వారికి పూర్తిగా కొబ్బరి పిండితో తయారుచేసిన పాయసాన్ని సమర్పిస్తారు. కొబ్బరికాయను చూర్ణం చేసి.. కొబ్బరి చూర్ణానికి బెల్లం జోడించి దీనిని రూపొందిస్తారు.
మధ్యాహ్నం సమయంలో స్వామి వారికి పూజ నిర్వహించేందుకు అరవణ పాయసం నివేదిస్తారు. ఇది చాలామంది భక్తులకు తెలిసిందే. బియ్యం, ఎండు కొబ్బరి ముక్కలు, స్వచ్ఛమైన నెయ్యి, సుగంధ ద్రవ్యాలు, ఎండు ద్రాక్ష, తాటి బెల్లం, పచ్చ కర్పూరంతో దీనిని తయారు చేస్తారు.
ఇతర పూజలు నిర్వహించినప్పుడు స్వామివారికి తెల్లటి నైవేద్యాన్ని సమర్పిస్తారు. రాత్రి 9:15 నిమిషాలకు నిర్వహించే పూజలో స్వామి వారి కోసం నువ్వుల పాయసాన్ని తయారుచేస్తారు. “స్వామివారికి నువ్వుల పాయసం సమర్పిస్తాం. అయితే ఇది పాయసం మాదిరిగా ఉండదు.. నువ్వులనే ఆ విధంగా రూపొందించి హరిహరసుతుడికి సమర్పిస్తామని” శబరిమలై తంత్రి కంటారార్ మహేష్ మోహనార్ వెల్లడించారు. స్వామివారికి సాయంత్రం చేస్తే పూజ కోసం పానకం, అప్పం, అడ అనే పానీయాలను నివేదిస్తారు.. పానకంలో జీలకర్ర, బెల్లం, పసుపు, నల్ల మిరియాలను కలుపుతారు.
స్వామివారికి తెల్లవారుజామున మూడు గంటలకు నిర్వహించే అభిషేకానికి పంచామృతం ఉపయోగిస్తారు.. స్పటిక బెల్లం, బెల్లం, అరటిపండు, రెండు ద్రాక్ష, నెయ్యి, తేనె, లవంగాల పొడి, యాలకుల పొడి వంటి వాటిని కలిపి పంచామృతం తయారు చేస్తారు. అరవణ ప్రసాదం తర్వాత పంచామృతం అత్యంత రుచికరంగా ఉంటుందని భక్తులు చెబుతుంటారు.. అరవణ ప్రసాదం మాదిరిగానే పంచామృతాన్ని కూడా విక్రయిస్తారు. ఇది ఒక్క సీసా ₹125 వరకు ఉంటుంది.