Andhra Pradesh Latest News: ఏపీ( Andhra Pradesh) గణనీయమైన అభివృద్ధి సాధిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. విశాఖ ఐటీ పరంగా గణనీయమైన వృద్ధిలో ఉంది. రాయలసీమలో తయారీ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. ఏకకాలంలో జరుగుతున్న ఈ అభివృద్ధి కొనసాగాలంటే స్థిరమైన ప్రభుత్వం అవసరం. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఏపీ ప్రజలను కోరుతోంది అదే. ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తే దాని అభివృద్ధి ఫలాలతో పాటు దాని ఫలితాలు లభిస్తాయి అన్నది వారి వాదన. రాజకీయపరంగా కొన్ని రకాల అభ్యంతరాలు రావచ్చు కానీ.. మంచి పాలన అందిస్తే ప్రజలే స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ఇప్పుడు మంచి పాలన అందిస్తున్నాం కాబట్టి తమ ప్రభుత్వాన్ని కొనసాగించాలని ఆ ఇద్దరు నేతలు కోరుకోవడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
అదే జరిగితే రాజధాని పూర్తయ్యేది..
2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం( Telugu Desam). ఐదేళ్లపాటు తన పాలనను కొనసాగించింది. అమరావతిని సైతం ప్రారంభించింది. కానీ ఇంతలోనే అధికారం మార్పిడి జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ మూడు రాజధానులను స్టాండ్ గా తీసుకొని అమరావతిని నిర్వీర్యం చేసింది. 2019లో మరోసారి టిడిపికి అవకాశం కల్పించి ఉంటే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని అందుబాటులోకి వచ్చేది. రెండోసారి అధికారమిచ్చి సవ్యమైన పాలన సాగకపోతే మాత్రం 2024లో అదే టిడిపిని అధికారానికి దూరం చేసి ఉంటే ఒకలా ఉండేది ఫలితం. ఇప్పుడు సీఎం చంద్రబాబు దానినే గుర్తు చేసి ఏపీలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. మరో 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగుతుందని చెప్పడం ద్వారా పవన్ ఇదే విషయాన్ని చెప్పగలుగుతున్నారు.
ఆ రెండు రాష్ట్రాల్లో..
స్థిరమైన ప్రభుత్వాలు చాలా రాష్ట్రాల్లో కొనసాగుతూ వచ్చాయి. దాని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధించారు. అంతెందుకు గుజరాత్లో గత ఆరు సార్లు బిజెపి ప్రభుత్వమే కొనసాగుతూ వస్తోంది. ఆ రెండు రాష్ట్రాల్లో కొంతవరకు ఫలితాలు వస్తున్నాయి. రాజకీయ అంశాల పరంగా అభ్యంతరాలు ఉండవచ్చు కానీ.. అభివృద్ధి ఫలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడా అక్కడ. అటువంటి పరిస్థితి ఏపీలో రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఒక్క టర్మ్ కే అవకాశం కల్పించారు. ఒకసారి స్థిరమైన ప్రభుత్వాన్ని ఇస్తే ఎంతవరకు సత్ఫలితాలు వస్తాయో ఏపీ ప్రజలు ఆలోచన చేయాలి.