Sri Rama Navami 2025: శ్రీరామ నవమి రాగానే దేశంమంతటా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా ఊరూరా, వాడ వాడలా జరుగుతుంది. కల్యాణోత్సవంలో కోట్లాది మంది భక్తులు పాల్గొని కల్యాణ వైభవాన్ని తిలకించి తరిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో (Telugu States)కల్యాణం అనగానే భద్రాచలం గుర్తుకు వస్తుంది. కానీ, సీతారాములు నిజంగా ఎక్కడ కల్యాణం చేసుకున్నారన్న విషయం చాలా మందికి తెలియదు. సీతారాముల కల్యాణం ఎక్కడ జరిగిందనే ప్రశ్న రామాయణ ఆసక్తులకు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు వారికి శ్రీరామనవమి అంటే భద్రాచలం(Bhadrachalam), ఒంటిమిట్ట(Vontimitta)ల్లో జరిగే కల్యాణోత్సవాలే గుర్తుకు వస్తాయి. అయితే, చారిత్రకంగా సీతారాముల వివాహం జరిగిన అసలు స్థలం భారతదేశం సరిహద్దులను దాటి నేపాల్‌లోని జనక్‌పూర్‌లో ఉందని పురాణాలు చెబుతున్నాయి.
Also Read: ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు.. టీటీడీ ప్రతిష్టాత్మక ఏర్పాట్లు!
జనక్‌పూర్‌లో..
రామాయణం ప్రకారం, అయోధ్య(Ayodhya)లో జన్మించిన శ్రీరాముడు(Sriramudu), మిథిలా(Mithila) నగరంలో పుట్టిన సీతను వివాహం చేసుకున్నాడు. మిథిలా రాజ్యం, సీత జన్మస్థలం, ఆనాటి విదేహ రాజ్యంగా పిలువబడేది. ఈ రాజ్యం నేటి బీహార్ నుంచి నేపాల్ వరకు విస్తరించి ఉండేది. సీతను ‘వైదేహి‘ అని పిలవడం ఈ రాజ్య చరిత్రకు నిదర్శనం. జనకుడు, సీత తండ్రి, పాలించిన మిథిలా రాజధాని నేటి జనక్‌పూర్‌గా గుర్తించబడింది. ఇక్కడే భూమిని దున్నుతుండగా సీత ఉద్భవించినట్లు, ఆమె వివాహం రాముడితో జరిగినట్లు స్థానిక ఐతిహ్యాలు చెబుతాయి.
జానకీ మందిరం..
జనక్‌పూర్(Jaljkpur)లోని జానకీ మందిరం ఈ వివాహ స్థలానికి ప్రసిద్ధ చిహ్నం. 1910లో నేపాల్ రాణి వృషభాను నిర్మించిన ఈ ఆలయం వేల గజాల విస్తీర్ణంలో, 150 అడుగుల ఎత్తైన ప్రాకారం, పాలరాతి గోడలు, అద్దాల మేడలతో అద్భుతంగా నిలుస్తుంది. దీని నిర్మాణానికి అప్పట్లో రూ. 9 లక్షలు వ్యయమైనట్లు చరిత్ర చెబుతోంది. ఆలయంలోని వివాహ మండపం సీతారాముల కల్యాణం జరిగిన ప్రదేశంగా భావించబడుతుంది. స్థల పురాణం ప్రకారం, సీత శివ ధనుస్సును పూజించిన స్థలం కూడా ఇదే.
ఏటా కల్యాణం..
ప్రతి సంవత్సరం మార్గశిర శుక్ల పంచమి నాడు జనక్‌పూర్‌లో సీతారాముల కల్యాణం వైభవంగా జరుగుతుంది. ఈ రోజునే వారి వివాహం జరిగిందని స్థానికుల నమ్మకం. అయితే, తెలుగు సంప్రదాయంలో శ్రీరామనవమి రోజున కల్యాణం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 2018లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలయాన్ని సందర్శించడంతో జనక్‌పూర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ ప్రదేశం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు భారత–నేపాల్ సాంస్కృతిక బంధాన్ని సూచిస్తుంది.