Venkateswara and Hanuman: శ్రావణమాసం ప్రారంభం కాగానే పండుగల సీజన్ మొదలైందని భావిస్తారు. ఈనెల మొత్తం ఎంతో పవిత్రంగా ఉంటూ ఉపవాసాలు చేస్తారు. దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. వ్రతాలు, నోములు నిర్వహిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. ఇలా అన్ని మంచి పనులకు కారణమైన శ్రావణమాసంలో పూజలు, వ్రతాలు మాత్రమే కాకుండా ఎన్నో ఏళ్ల నాటి శని బాధలు.. కష్టాలు ఉన్నవారు కూడా కొన్ని పరిహారాలు చేయడం వల్ల శాశ్వతంగా విముక్తి పొందే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి ధనం లేక.. కష్టాలతో కూడుకున్న వారు ఈ మాసంలో.. ముఖ్యంగా శనివారం రోజున ఈ పరిహారాలు చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందుతారు. మరి శ్రావణ శనివారం రోజు ఎలాంటి పరిహారం చేయాలి?
Also Read: కళ్ళు తెరిచిన శివుడు.. తరలివస్తున్న భక్తులు.. ఈ అద్భుతం ఎక్కడంటే?
శనివారం అనగానే వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు చేస్తారు. సాధారణంగానే ఆ కలియుగ దేవుడికి భక్తితో పూజలు చేస్తే కరుణిస్తాడు. అలాంటిది శ్రావణమాసంలో స్వామివారిని కొలవడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని అంటున్నారు. శ్రీనివాసుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం. అందువల్ల నారాయణుడికి శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఏళ్ల నాటి శని నుంచి విముక్తి పొందవచ్చని అంటున్నారు. శ్రావణ శనివారం రోజున గోమాతకు పూజలు చేసి ఆహారం లేదా గ్రాసం తినిపించడం వల్ల ఇల్లు సంతోషంగా ఉంటుంది.
శ్రావణ శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ రోజున పేదలకు అన్నదానం చేయడం వల్ల కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు వస్త్ర దానం చేయడం వల్ల ఇప్పటివరకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. శనీశ్వరుడికి శనివారం అంటే ప్రీతి. ఈరోజున నవగ్రహాల పూజలు చేసి అష్ట ధాన్యాలను పండితులకు దానం ఇవ్వడం వల్ల దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. అలా చేస్తే అకాల మృత్యువు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
Also Read: హమ్మయ్య.. ఇక బంగారం కొనొచ్చు.. భారీగా తగ్గిన ధరలు..
అలాగే ఈరోజు హనుమాన్ ఆలయంలో కూడా కొన్ని పరిహారాలు చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందుతారు. శ్రావణ శనివారం రోజు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రశాంతంగా హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఇప్పటివరకు ఉన్న అప్పుల బాధల నుంచి విముక్తి పొందుతారు.అయితే శ్రావణ శనివారం రోజున నల్ల దుస్తులు, ఉప్పు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయరాదు. కొనుగోలు చేసిన వాటిని ఇంటికి తీసుకురాకూడదు. ఇలా చేయడం వల్ల అనేక బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
శ్రావణం పూజలకు అనుకూలమైన మాసం. అలాగే ఏళ్లనాటి శని నుంచి విముక్తి పొందడానికి పరిహారాలు చేసుకునే సమయం. అందువల్ల కొన్ని పద్ధతుల గురించి ముందే తెలుసుకొని వాటిని పాటించడం వల్ల జీవితం సంతోషంగా మారే అవకాశం ఉంటుంది.