Puri Jagannath Prasadam: రథయాత్ర ప్రారంభానికి కొద్ది నెలల ముందే పనులు మొదలవుతాయి. ప్రత్యేకమైన కలపతో స్వామివారి రధాన్ని తయారుచేస్తారు. ప్రతి ఏడాది రథాన్ని రూపొందిస్తూ ఉంటారు. చేయి తిరిగిన కళాకారులు మాత్రమే రథం తయారీలో నిమగ్నమై ఉంటారు. స్వామి వారి కోసం ఒడిశా ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల్లో చెట్లను తీసుకువచ్చి.. స్వామివారి ప్రధానికి అనుకూలంగా మలుచుతారు. స్వామివారి రథయాత్ర జరిగేటప్పుడు భక్తులు చేసే జయ జయ ధ్వానాలు ఆబాల గోపాలాన్ని అలరిస్తుంటాయి. రథయాత్ర సందర్భంగా భక్తులు చేసే కోలాటాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఆ దృశ్యాలను చూసేందుకు రెండు కళ్ళు కూడా సరిపోవు అంటే.. ఎంత బాగుంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేడుకలను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తుంటారు.. ప్రస్తుతం పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో.. స్వామి వెలసిన క్షేత్రం భక్తజనులతో కిటకిటలాడుతోంది. రథయాత్ర ప్రారంభమయ్యే రోజుల్లో పూరి క్షేత్రం అద్భుతంగా దర్శనమిస్తుంది. అయితే భక్తులు ఆ స్థాయిలో వచ్చినా కూడా ఏమాత్రం తొక్కిసలాట వంటి ఘటనలు చోటు చేసుకోవు. పైగా భక్తులు స్వామివారి రథయాత్రలో క్రమశిక్షణ పాటిస్తారు.
Also Read: నిన్న సఫారీలు, నేడు కరేబియన్లు.. సుదీర్ఘ ఫార్మాట్ లో కంగారుల పని ఖతమేనా?
ప్రసాదం కూడా ప్రత్యేకమే
పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రస్తుతం ప్రారంభమైంది. రథయాత్ర కన్నుల పండువగా సాగుతోంది. ఈ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జగన్నాథ స్వామి భక్తులు పాల్గొంటున్నారు. అయితే జగన్నాథ స్వామి రథయాత్ర మాత్రమే కాకుండా స్వామివారి ప్రసాదం కూడా అంతే ప్రాచుర్యాన్ని పొందింది. ఏకంగా 56 వెరైటీలతో స్వామివారికి ప్రసాదాన్ని తయారుచేస్తారు. దీనిని ఒరియాలో “ఛప్పన్ భోగ్” అని పిలుస్తుంటారు. ప్రసాదంలో ప్రత్యేకంగా పండించిన బియ్యంతో అన్నం, కూరగాయల మిశ్రమాలతో కిచిడి, పూరి, మాల్పూవా, రసగుల్లా, బాదం, కొబ్బరి నీళ్లు, జిలేబి, పాలకూర, పకోడా, బుజియా, పాయసం, ఎండుఫలాలతో తయారుచేసిన ప్రత్యేకమైన మిశ్రమం వంటివి స్వామివారికి నివేదిస్తారు. అయితే ఈ ప్రసాదాలు తయారు చేసేటప్పుడు ఎలాంటి వాసన రాదు. ఒక్కసారిగా వీటిని స్వామి వారికి నివేదించిన తర్వాత అదిరిపోయే స్థాయిలో సువాసనలు వస్తుంటాయి. ఇది స్వామి వారి కరుణాకటాక్షానికి నిదర్శనమని భక్తులు చెబుతుంటారు. రథయాత్ర జరిగిన రోజులు పూరి క్షేత్రంలో భక్తులకు అన్నదానం చేస్తారు. ఈ సమయంలో రకరకాల వంటకాలతో భక్తుల కడుపు నింపుతారు.. ఆ సమయంలో కిచిడి, బుజియా, అన్నం వంటివి భక్తులకు పెడతారు. ఎంత స్థాయిలో భక్తులు వచ్చినా.. అందరికీ లేదనకుండా, కాదనకుండా ఆకలి తీర్చుతారు. దీనిని భక్తులు స్వామివారి దివ్య ప్రసాదంగా పేర్కొంటారు. దివ్య ప్రసాదాన్ని తినడానికే భక్తులు వస్తుంటారంటే అతిశయోక్తి కాదు.