Rama Navami 2024: పితృ వాక్య పరిపాలకుడిగా.. ధర్మాన్ని ఆచరించిన రాజుగా.. సత్యమే పలికిన పాలకుడిగా.. ప్రజా రంజక పరిపాలన అందించిన చక్రవర్తిగా.. ఏకపత్ని వతుడైన భర్తగా.. ఇలా సకల గుణాలతో.. ప్రతి గుడిలోనే కాదు.. ప్రతి గుండెలోన కొలువై ఉన్నవాడు రాముడు.. మన జీవితంలో.. మన మాటలో.. మన పలుకులో.. మన నడకలో.. మన నడవడికలో.. రామ శబ్దమే వినిపిస్తుంది. రామ నామమే ధ్వనిస్తుంది. చిన్నప్పుడు లాలపోసే సమయంలో శ్రీరామరక్ష చెప్పడం దగ్గర నుంచి.. “రామా లాలీ.. మేఘశ్యామా లాలీ” తో.. పిల్లల్ని నిద్రపుచ్చడం వరకు.. రాముడు మన జీవితంలో ఒక భాగం అయిపోయాడు. నేడు ఆ జగదభిరాముడి కళ్యాణం.. అంతేకాదు ఆయన జన్మించిన రోజు కూడా.. బహుశా పుట్టినరోజు నాడే పెళ్లి చేసుకునే ఘనత దేవదేవతల్లో రాముడికి మాత్రమే సొంతం కావచ్చు.
ఆ తిథి నాడే..
శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆ ప్రకారం ఆ రోజు రాముడు జన్మదిన వేడుకలు నిర్వహించాలి. అయితే పురుషోత్తమ సంహిత అనే ఆగమ శాస్త్ర గ్రంథం ప్రకారం .. రాముడి అవతార పూర్తిగా ఏ రోజునైతే ఈ నేలపై అవతరిస్తాడో.. ఆ రోజే అతడి వివాహం జరిపించాలి. ఒకవేళ అ తిథి తెలియకపోతే ఏకాదశి రోజున కళ్యాణం జరిపించాలి. అందుకే లోక కళ్యాణం కోసం సీతారాములకు భద్రాచలంలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నాడు అభిజిత్ లగ్నంలో వివాహ వేడుకలు జరిపిస్తుంటారు.
ఆ సమయంలోనే ఎందుకు
రాముడు త్రేతాయుగంలో వసంత రుతువు, చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం.. అంటే మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు జన్మించాడు. అందుకే చైత్ర శుద్ధ నామి రోజున శ్రీరాముడి పరిణయం, 14 సంవత్సరాల వనవాసం, రావణుడి సంహారం.. ఆ తర్వాత శ్రీరాముడు సీతా సమేత అయోధ్య పట్టాభిషిక్తుడు కావడం.. ఆరోజు కూడా చైత్ర శుద్ధ నామి కావడం విశేషం. శ్రీరామనవమి రోజున ప్రతి సీతారాముల ఆలయంలో కళ్యాణం జరిపిస్తారు. సాయంత్రం స్వామివారిని వీధుల్లో ఊరేగిస్తారు. శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు కాబట్టి.. మధ్యాహ్నం 12 గంటలకు నిష్ఠతో పూజ చేస్తే శ్రీరామాగ్రహంతో భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.
కన్నుల పండువగా..
ప్రతి ఏడాది చైత్ర శుద్ధ నామి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం.. సీతారాముల తిరు కళ్యాణ మహోత్సవాన్ని భద్రాచలంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకను చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. తానిషా గోల్కొండ నవాబుగా ఉన్న కాలం నుంచి ఆనాటి సాంప్రదాయం ప్రకారం నేటికీ భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురావడం ఆనవాయితీ. వీటిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి భద్రాద్రి దేవాలయానికి సమర్పిస్తారు. అయితే ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్యాణానికి హాజరు కావడం లేదు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాములవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణానికి హాజరయ్యారు.