Kalki 2898 AD: ప్రభాస్ ఒక్కో సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నారు. ఆయన నెక్స్ట్ మూవీ కల్కి 2829 AD పై భారీ హైప్ ఉంది. ఇదే స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటుంది. విడుదలకు ముందే కల్కి రికార్డుల మోత మోగిస్తుంది. కల్కి మూవీ ప్రభాస్ లేటెస్ట్ రిలీజ్ సలార్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని దాటేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ మేరకు ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ మూడు ప్లాప్స్ ఇచ్చాడు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ఆశించిన స్థాయిలో ఆడలేదు.
అయినప్పటికీ ప్రభాస్ ఇమేజ్ ఇంచు కూడా తగ్గలేదు. సలార్ మూవీతో ఆయన హిట్ ట్రాక్ ఎక్కారు. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ వరల్డ్ వైడ్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మిక్స్డ్ టాక్ తో కూడా సలార్ ఈ రేంజ్ వసూళ్లు సాధించింది. కాగా సలార్ తెలుగు రాష్ట్రాల్లో రూ. 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ రికార్డును కల్కి 2829 AD అధిగమించింది.
కల్కి నైజాం రైట్స్ రూ. 75 కోట్లకు అమ్మినట్లు సమాచారం. సీడెడ్ లో రూ. 30 కోట్లు పలికాయట. ఆంధ్ర రైట్స్ రూ. 80-90 కోట్లకు డీల్ జరుగుతున్నట్లు సమాచారం. మొత్తంగా ఏపీ/తెలంగాణ రైట్స్ రూ. 190 కోట్ల వరకు పలుకుతున్నాయట. సలార్ కి మించిన హైప్ కల్కి మీద ఉంది అనడానికి ఇది నిదర్శనం. డిస్ట్రిబ్యూటర్స్ కల్కి హక్కుల కోసం పోటీపడుతున్నారు. కల్కి చిత్రాన్ని రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.
ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. టైం ట్రావెల్ ఆధారంగా కథ నడుస్తుందనే వాదన ఉంది. భవిష్యత్ ఎలా ఉంటుందో చూపిస్తామని దర్శకుడు నాగ్ అశ్విన్ అంటున్నారు. ఇక కల్కి మూవీలో భారీ క్యాస్ట్ నటిస్తుంది. దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక రోల్స్ చేస్తున్నారు. మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. విడుదల వాయిదా పడే అవకాశం కలదంటున్నారు.