Sri Rama Navami: రాముడి పరిపాలన కాలంలో ధర్మం నాలుగు పాదాల్లో నడిచిందట. దేశం సుభిక్షంగా ఉందట. పాడిపంటలతో, సుఖశాంతులతో ప్రజలు వర్ధిల్లారట. అందుకే రామరాజ్యం అనే పదం స్థిరపడిపోయింది. రాముడి పాలన అనే ఐతిహ్యం పుట్టింది. అందుకే కబీర్ దాస్ నుంచి మొదలు పెడితే తులసీదాస్ వరకు ఈ జగమంతా రామమయం అని వెయ్యినోళ్ల స్తుతించారు. ఆ పురాణ పురుషుడిని.. పుణ్య చరితమైన రామాయణాన్ని.. కీర్తించారు. తమ కీర్తనలతో అశేష భక్త జనాన్ని ఓలలాడించారు.. అందుకే రామాయణం విన్నా.. ఆ పుణ్య పురుషుడి కథ విన్నా.. శుభం కలుగుతుందని ప్రతీతి.
దేవుడే కాదు.. అతని నామమే తారక మంత్రం
రాముడు దేవుడు మాత్రమే కాదు.. అతని నామం కూడా తారక మంత్రం అని పురాణాలు చెబుతున్నాయి..”శ్రీరామ రామ రామేతి. రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం.. రామనామ వరాననే” అని శ్లోకం విష్ణు సహస్రనామంతో సమానమైంది. మోక్షాన్ని ప్రసాదించే మహామంత్రాలు ఓం నమో నారాయణాయ:, ఓం నమశ్శివాయ: నుంచి తీసుకున్న అక్షరాల కలయికే రామనామం.. మన పెదవులు రామ నామంలో “రా ” అనే అక్షరాన్ని పలికినప్పుడు పాపాలు మొత్తం బయటికి వెళ్లిపోతాయి. “మ” అనే అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు పాపాలు లోపలికి రాకుండా ద్వారాలు మూసుకుంటాయి. అందువల్లే “రామ” అనే రెండు అక్షరాల తారకమంత్రాన్ని సదా స్మరించడం వల్ల పాపాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని కబీర్ దాస్, రామదాస్, తులసి దాస్ వంటి మహా భక్తులు తమ కీర్తనల్లో పేర్కొన్నారు.
శ్రీరామనవమి నాడు ఏం చేయాలంటే
శ్రీరామనవమి రోజున రాముడితో పాటు సీతాదేవి, ఆంజనేయుడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను పూజించాలి. రాముడికి జన్మనిచ్చిన దశరధుడిని, ఆయన సతీమణి కౌసల్య దేవిని స్తుతించాలి. రామనామి వేడుకల్లో పాల్గొనాలి. ఆ వివాహ క్రతవును చూడాలి. శ్రీరామ వ్రతాన్ని ఆచరించాలి. విసన కర్రలు దానం చేస్తే మంచిదని శాస్త్రం చెబుతోంది. శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు, చలిమిడి, పండ్లు, చక్కెర పొంగలి, చెరకు గడలు, విప్పపూలు స్వామివారికి సమర్పించాలి. సీతారామ కళ్యాణ తలంబ్రాలను పూజ గదిలో ఉంచుకుంటే.. ఆటంకాలు తొలగిపోయి సత్వరం వివాహం జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు.
రాముడే రక్ష
నిత్య జీవితంలో రాముడి ప్రస్తావన లేకుండా మన మనుగడ కొనసాగదు. చిన్నపిల్లలకు లాల పోసేటప్పుడు శ్రీరామరక్ష, జోల పాడేటప్పుడు రామాలాలి, మేఘశ్యామ లాలి అని తల్లులు పాడుతుంటారు. అలా పాడితే రాముడి రక్ష పిల్లల మీద ఉంటుందని ప్రతీతి. అనకూడని మాట అంటే రామ రామ అని.. ఓదార్పు మాటలకు అయ్యో రామా అని.. చిట్టా పద్దు పుస్తకాలు ప్రారంభిస్తే శ్రీరామ అని.. కూర్చుని లేచేటప్పుడు రామా అని.. ఇలా అందరి నోట్లో రాముడి నామం ధ్వనిస్తూనే ఉంటుంది. చిన్నపిల్లలు అల్లరి చేస్తే కిష్కింధకాండ అని.. కఠినమైన ఆజ్ఞ ఇస్తే సుగ్రీవాజ్ఞ అని.. విశాలమైన ఇంటి గురించి ప్రస్తావిస్తే లంకంత ఇల్లు అని.. పాత వాటి గురించి చెప్పాలంటే ఇక్ష్వాకుల కాలంనాటిదని..”రామాయణం మొత్తం విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టు.. చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు.. ఆకారం గురించి చెప్పాలంటే రాముడిలా ఆజానుబాహుడని.. ఎంతకీ చూడ్డానికి రాకపోతే సీత కన్నేశావని.. సైన్యంలా వస్తే రామదండు అని.. చక్కని జంట గురించి ప్రస్తావిస్తే సీతారాముల్లా ఉన్నారని.. ఎవరైనా కొట్టుకుంటే రామ రావణ యుద్ధం అని.. అందరి ఇళ్లల్లో ఉండే గిల్లికజ్జాలను ఇంటింటి రామాయణం అని.. ఇలా రాముడు గురించి, రామాయణం గురించి మన ఇంట్లో ప్రతిక్షణం ప్రస్తావన జరుగుతూనే ఉంటుంది. స్థూలంగా రాముడు దేవుడు మాత్రమే కాదు.. విలువలు నేర్పిన మార్గదర్శి, వ్యక్తిత్వాన్ని అలవర్చిన రామ రుషి..