ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతంగా చలి ఉంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో అయితే ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలో నమోదు అవుతున్నాయి. పొగ మంచు దట్టంగా కురుస్తోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రోడ్లమీద రాకపోకలు సాగించాలంటే లైట్లు వేసుకొని వెళ్లాల్సిన దుస్థితి. ఇటువంటి సమయంలో శరీరం వేడిని కోరుకుంటుంది. వేడిగా ఉండే ఆహార పదార్థాలను తినాలని అనుకుంటుంది. అయితే ఇటువంటి వాతావరణంలో ఉత్తర భారతదేశానికి చెందిన మహిళలు మంగళవారం కఠిన ఉపవాసం ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి 9:30 వరకు వారు ఇదే తీరుగా ఉపవాసం ఉంటారు.
ఉత్తర భారత దేశానికి చెందిన మహిళలు ఇలా ఉపవాసం ఉండడానికి ప్రధాన కారణం ఉంది. ప్రస్తుతం మాఘమాసం కొనసాగుతోంది. ఈ మాసంలో కృష్ణపక్షం చతుర్థి రోజు ఉత్తర భారతదేశానికి చెందిన మహిళలు సంకష్టి గణేష్ చతుర్థిగా జరుపుకుంటారు. ప్రీతియోగం, సర్వార్ధ అమృత సిద్ధయోగం అద్భుత కలయికగా ఈరోజున చెప్పుకుంటారు.. మహిళలు కఠినమైన ఉపవాసం ఉంటారు. రాత్రి 8 గంటల 45 నిమిషాలు, తొమ్మిది గంటల 30 నిమిషాల మధ్య చంద్రోదయం ఏర్పడుతుంది. ఆ సమయంలో మహిళలు చంద్రుడికి నైవేద్యాలు సమర్పిస్తారు.
ఉపవాసం ఉండే మహిళలు చంద్రోదయం కంటే ముందు స్నానం చేశారు. నూతన వస్త్రాలు ధరిస్తారు. ఆవు పేడతో చతురస్రాకారంలో పూస్తారు. ఆ తర్వాత అక్కడ పూలు.. అగర్బత్తీలు.. ఇతర పూజా ద్రవ్యాలు ఉంచి పూజలు చేస్తారు. చంద్రోదయం తర్వాత చంద్రుడికి రాగి పాత్ర నుంచి ఎర్ర గంధం, కుశ గడ్డి, పువ్వులు, బియ్యం, జమ్మి ఆకులు సమర్పిస్తారు. ఉపవాసం సమయంలో మహిళలు గౌరీ గణేషుడు, చంద్రుడికి పూజలు చేస్తారు.
ఉపవాసం ఉండే మహిళలు ప్రతి వస్తువును గణేశుడికి 4 పరిమాణాలలో సమర్పిస్తారు. ఇందులో కందగడ్డలు, బెల్లం, నువ్వులు, తమలపాకులు ఉంటాయి. పాలు, నెయ్యి, పంచదార, అరటిపండు, యాలకులు ఇతర మిశ్రమాలతో నైవేద్యం తయారుచేసి చంద్రుడికి సమర్పిస్తారు. నల్ల నువ్వులు, నీరు, పువ్వులు కుడి చేతిలో పెట్టుకొని గణపతి విగ్రహం చుట్టు నాలుగు ప్రదక్షణలు చేస్తారు. ఉపవాసాన్ని ముగించిన తర్వాత నువ్వులు, బెల్లం, ఎర్ర దుంపలతో ప్రత్యేకమైన వంటకాలు చేస్తారు. ఇలా ఉపవాసం చేయడం వల్ల కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని.. అనేక అడ్డంకులను తొలగించడానికి మార్గం ఏర్పడుతుందని.. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని ఉత్తరాది మహిళలు భావిస్తుంటారు. ముఖ్యంగా శని, ఇతర కష్టాల నుంచి ఉపశమనం లభించి.. దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుందని నమ్ముతుంటారు.