https://oktelugu.com/

Sabarimala Aravana Prasadam : తిరుమల లడ్డు వివాదం మర్చిపోకముందే.. వెలుగులోకి మరో దారుణం.. ఈసారి ఏ గుడిలోనంటే..

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అటు అధికార కూటమి, ఇటు వైసిపి పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో తిరుమల లడ్డు వివాదం ఇప్పట్లో సర్దుమనిగే అవకాశం కనిపించడం లేదు. ఇది ఇలా ఉండగానే తెరపైకి మరో గుడికి సంబంధించిన వివాదం వచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 7, 2024 7:04 pm
Sabarimala Aravana Prasadam

Sabarimala Aravana Prasadam

Follow us on

Sabarimala Aravana Prasadam : తిరుమల తర్వాత ఆ స్థాయిలో ప్రాశస్త్యం పొందిన క్షేత్రం శబరిమల. కేరళ రాష్ట్రంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో పంబా నది తీరంలో శబరిమల క్షేత్రం ఉంటుంది. ప్రతి ఏడాది ఈ క్షేత్రానికి భారీగా భక్తులు వస్తుంటారు. అయ్యప్ప మాల ధరించిన వారికి మాత్రమే ఈ క్షేత్రంలోకి ప్రవేశం ఉంటుంది. ముఖ్యంగా కార్తీక మాసం నుంచి మొదలు పెడితే సంక్రాంతి వరకు శబరిమల క్షేత్రం అయ్యప్ప మాలధారులతో సందడిగా ఉంటుంది. ఇక్కడ తయారు చేసే ప్రసాదం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. బెల్లం, అటుకులు, నెయ్యి, సుగంధ ద్రవ్యాల తో ఈ ప్రసాదం తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని అల్యూమినియం తో రూపొందించిన బాక్స్ లలో భద్రపరుస్తారు. స్వామివారి ఈ ప్రసాదానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.. అయితే ఈ ప్రసాదానికి సంబంధించిన ఓ వివాదం ప్రస్తుతం జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. శబరిమలలో ప్రసాదాన్ని అరవణలో తయారు చేస్తారు. అయితే అరవణ లో కల్తీ జరిగిందని ఆరోపణ వినిపిస్తున్నాయి. మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయనే వాదనలు తెరపైకి వచ్చాయి. దీంతో అరవణను ఎరువుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శబరిమల క్షేత్రంలోని 6.65 లక్షల కంటైనర్లలో ఈ ప్రసాదం ఏడాదికాలంగా.. నిరుపయోగంగా ఉంటున్నది.

యాలకుల్లో క్రిమిసంహారకాలు..

శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం తయారీలో విరివిగా యాలకులు వాడతారు. అయితే ఆ యాలకుల్లో ఆమోదించిన స్థాయి కంటే ఎక్కువగా క్రిమిసంహారకాలు కలిశాయని ఆరోపణలు వస్తున్నాయి. అందువల్లే వాటిని వాడకుండా నిరుపయోగంగా పడేశారని తెలుస్తోంది. భక్తుల మనోభావాలు దెబ్బకుండా ట్రావెన్ కోర్ టెంపుల్ డెవలప్మెంట్ బోర్డ్ ఆ ప్రసాదాన్ని శాస్త్రీయ విధానాల్లో బయట పారబోసేందుకు టెండర్లను ఇటీవల ఆహ్వానించింది. ఈ టెండర్ ను ఇండియన్ సెంట్రిఫ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ దక్కించుకుంది. అయితే వారు కలుషితమైన ఆ ప్రసాదాన్ని ఎరువుగా మారుస్తారని టిడిబి చైర్మన్ ప్రశాంత్ ప్రకటించారు. ” తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ఇటీవల వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉంది. దాన్ని మర్చిపోకముందే ఇప్పుడు శబరిమల అయ్యప్ప ప్రసాదంలో క్రిమిసంహారకాలు కలిశాయని వాదనలు వినిపిస్తున్నాయి. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం కట్టిపెట్టి.. శాస్త్రీయ విధానాలలో ప్రసాదాలు తయారుచేయాలి. లేకుంటే భక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని” అయ్యప్ప మాలధారులు అంటున్నారు. ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చూడాలని.. అప్పుడే ఆ క్షేత్రాల ప్రాశస్త్యం దెబ్బ తినకుండా ఉంటుందని వారు హితవు పలుకుతున్నారు.. అయితే ఆ పరిణామం నుంచి శబరిమల అయ్యప్ప దేవస్థానం నాణ్యమైన యాలకులను దిగుమతి చేసుకుంటున్నదని వార్తలు వినిపిస్తున్నాయి.